తెలంగాణ అంటే హైదరాబాద్ మాత్రమే కాదు.. గవర్నర్‌ తమిళిసై

Update: 2023-06-02 07:18 GMT

రాజ్‌భవన్‌లో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. వేడుకల్లో భాగంగా గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ రాజ్‌భవన్‌లో కేక్ కట్ చేశారు. అక్కడ నృత్యకారులతో కలిసి గవర్నర్ ఉత్సాహంగా డ్యాన్స్ చేశారు. అనంతరం గవర్నర్‌ మాట్లాడుతూ.. అమరవీరుల త్యాగాలను స్మరించుకున్నారు. గవర్నర్ తొలిసారి తన ప్రసంగాన్ని మొత్తం తెలుగులో మాట్లాడారు. అనేక పోరాటాల వల్ల సాధించుకున్న తెలంగాణకు (Telangana) గవర్నర్‌గా రావడం దేవుని ఆశీర్వాదమన్నారు.

ఆధునిక ప్రపంచంలో తెలంగాణ ఉద్యమానికి ప్రత్యేక స్థానం ఉందని తెలిపారు. తెలంగాణ అమరవీరులకు పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేశారు. స్వరాష్ట్ర ఏర్పాటులో భాగంగా తనువు చాలించిన వారి పేర్లను స్మరించుకోవడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. తొలి దశ తెలంగాణ ఉద్యమంలో మూడు వందల మంది అమరులయ్యారన్నారు. దశాబ్ద కాలంలో తెలంగాణ ఎన్నో ప్రత్యేకతలు చవి చూసిందని చెప్పారు. తెలంగాణ అంటే స్లోగన్ కాదని.. అది ఆత్మ గౌరవ నినాదమన్నారు. తెలంగాణ అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని గవర్నర్ తమిళి సై ఆకాంక్షించారు.

అనేక రంగాల్లో తెలంగాణ ప్రత్యేకత చాటుకుంటోందని గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ అన్నారు. హైదరాబాద్‌ సహజసిద్ధ అనుకూలతతో వేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు. తెలంగాణ అభివృద్ధి అంటే హైదరాబాద్ అభివృద్ధి మాత్రమే కాదని గవర్నర్ అన్నారు. తెలంగాణ రాష్ట్రం మొత్తం అభివృద్ధి అయితేనే సంపూర్ణ అభివృద్ధి అనిపించుకుంటుందని చెప్పారు. ‘‘నీళ్లు, నిధులు, నియామకాల ఆకాంక్షలతోనే తెలంగాణ ఉద్యమం వచ్చింది. అంటే కొందరు మాత్రమే కాదు.. అందరూ అభివృద్ధి చెందాలి. జై తెలంగాణ అంటే కేవలం ఒక నినాదం మాత్రమే కాదు. జై తెలంగాణ అంటే ఆత్మగౌరవానికి చిహ్నం. నా జీవితంలో ప్రతి నిమిషం ప్రజల కోసమే. రాష్ట్రానికి జాతీయ స్థాయిలో ఖ్యాతి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నాను. రాష్ట్రాభివృద్ధికి ఎన్‌ఆర్‌ఐలు చేయూత అందివ్వాలని కోరుతున్నాను. సరికొత్త తెలంగాణ రాష్ట్రాన్ని ఆవిష్కరించుకుందాం. తెలంగాణను దేశంలోనే నంబర్‌ 1గా తీర్చిదిద్దుకుందాం’’ అని తమిళిసై అన్నారు.

అమరవీరులందరికీ జోహార్లు తెలిపిన గవర్నర్ తమిళిసై... ‘‘నా జీవితంలో ప్రతి నిమిషం ప్రజల కోసమే.. దేవుడు నన్ను తెలంగాణకు పంపడం గొప్ప అదృష్టం. నేను మీతో ఉన్నాను. మీరు నాతో ఉన్నారు’’ అని పేర్కొన్నారు.




Tags:    

Similar News