తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాడి ఇవాళ్టికి పదో ఏడాదిలోకి అడుగుపెడుతున్న వేళ.. రాజకీయ పార్టీలు పోటాపోటీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. రాష్ట్ర ఏర్పాటు నాటి నుంచి అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్(BRS).. నేటి నుంచి 22వ తేదీ వరకు దశాబ్ది వేడుకలను నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఉత్సవాల్లో భాగంగా హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం చేస్తున్న కృషిని ప్రజలకు తెలియజేసే కార్యక్రమాలు, ఒక్కో రంగం సాధించిన విజయాలను ప్రతిబింబించేలా వేడుకలు నిర్వహించనున్నారు. స్వాతంత్య్ర దినోత్సవ సంస్మరణ సందర్భంగా తొలిరోజున జాతీయ జెండాల ఆవిష్కరణ, ప్రత్యేక కార్యక్రమాలు నగర వ్యాప్తంగా నిర్వహించనున్నారు.
ముందుగా తెలంగాణ శాసన మండలిలో రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. మండలి ప్రాంగణంలో చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీలు తక్కెళ్లపల్లి రవీందర్ రావు, బోగరపు దయానంద్, దండే విఠల్, నవీన్ కుమార్, రఘోత్తం రెడ్డి, శాసన సభ కార్యదర్శి డాక్టర్ నరసింహా చార్యులు, బీఆర్ఎస్ ఎల్పీ కార్యదర్శి రమేశ్ రెడ్డి, గుత్తా వెంకట్ రెడ్డి మెమోరియల్ ట్రస్ట్ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.