దశాబ్ధి వేడుకలకు ముస్తాబైన తెలంగాణ.. సచివాలయంలోనే శ్రీకారం

Update: 2023-06-02 01:12 GMT




దశాబ్ది ఉత్సవాలకు తెలంగాణ ముస్తాబెైంది. 2014 జూన్ రెండో తేదీన ఆవిర్భవించిన తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం.. తొమ్మిది వసంతాలు పూర్తి చేసుకుని పదో ఏట అడగుపెడుతున్న వేళ ఘనంగా వేడుకలు జరగనున్నాయి. తొమిదేళ్ల ప్రగతి ప్రస్థానాన్ని చాటేలా ఉత్సవాలు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామగ్రామాన 21 రోజుల పాటు రోజుకొక రంగానికి సంబంధించిన కార్యక్రమాలు నిర్వహించేలా ఏర్పాట్లు చేశారు. నేడు సచివాలయం వేదికగా వేడుకలకు ముఖ్యమంత్రి కేసీఆర్ శ్రీకారం చుట్టనున్నారు.

ఈ క్రమంలోనే కేసీఆర్ ఉదయం గన్‌పార్క్‌లోని అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించి... ఆ తర్వాత.. తెలంగాణ సర్కార్ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన పాలనా సౌధంలో దశాబ్ధి వేడుకలను ప్రారంభించనున్నారు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనం స్వీకరిస్తారు. అనంతరం దశాబ్ది వేడుకల సందర్భంగా ప్రసంగిస్తారు. సచివాలయ ప్రారంభం అనంతరం జరుగుతున్న మొదటి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. మొత్తం 15,000 మందికి సరిపడేలా కుర్చీలు ఏర్పాటు చేశారు.

సచివాలయ ఉద్యోగులతో పాటు జీహెచ్ఎంసీ పరిధిలోని విభాగాధిపతుల కార్యాలయాల్లోని ఉద్యోగులు.. వేడుకలకు హాజరు కానున్నారు. వారి కోసం ప్రత్యేకంగా 300 బస్సులు ఏర్పాటు చేశారు. వర్షం, ఎండకు సంబంధించి కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా టెంట్లు వేశారు. ఈ ప్రారంభ వేడుకల కోసం రూ.1.80 కోట్లు మంజూరు చేశారు. విభాగాధిపతులు అందరూ ఉదయం ఏడున్నరకు తమ కార్యాలయాల్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి.. ఎనిమిది గంటల్లోపు సచివాలయం చేరుకోవాలని ఆదేశించారు.

రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల నేపథ్యంలో నగరంలోని పలు ప్రాంతాలను విద్యుత్‌ దీపాలంకరణతో అందంగా తీర్చిదిద్దారు. నూతన సచివాలయం, అమరవీరుల స్మారక స్తూపం, అసెంబ్లీ, గన్‌పార్క్‌ కూడళ్లు, నిజాం కళాశాల పరిసరాలు.. విద్యుత్ దీపాలతో అలంకరించారు.




Similar News