ఉస్మానియా ఆస్పత్రి అంశంపై గవర్నర్ వర్సెస్ గవర్నమెంట్గా పరిస్థితి ఉంది. ఉస్మానియా ఆస్పత్రిని గవర్నర్ తమిళిసై పరిశీలించారు. అదే సమయంలో ఆస్పత్రిపై మంత్రి హరీష్ సమీక్ష నిర్వహిస్తున్నారు. ఆస్పత్రి భవనం పరిస్థితి, నూతన భవనం నిర్మాణం గురించి అధికారులను అడిగి తెల్సుకున్నారు. అనంతరం తమిళిసై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులను కలిసి వారితో మాట్లాడారు. సౌకర్యాలు, వైద్యం అందుతున్న తీరు.. పలు వివరాలను అడిగి తెలుసుకున్నారు.
ఉస్మానియా ఆస్పత్రి భవనం కట్టి వంద ఏళ్లు అవుతోందని.. కొత్త భవనం కట్టాల్సిన అవసరం ఉందని గవర్నర్ అన్నారు. తాను ఎవరినీ తప్పుబట్టేందుకు ఆస్పత్రికి రాలేదని చెప్పారు.
‘‘ఆసుపత్రిలోని టాయిలెట్లు పరిశీలించా.. పరిస్థితి దారుణంగా ఉంది. రోజుకు 2వేల మంది ఔట్ పేషెంట్లు వస్తున్నారు. ఆసుపత్రి పైకప్పు పెచ్చులు ఊడి రోగులు ఇబ్బందలు పడుతున్నారు. రోజుకు 200 వరకు సర్జరీలు చేస్తున్నారు. జనరల్ వార్డులో కొన్ని ఫ్యాన్లు మాత్రమే పనిచేస్తున్నాయి. ఎండ వేడి తట్టుకోలేకపోతున్నామని రోగులు వాపోతున్నారు’’ అని తమిళిసై అన్నారు.
ఇటీవలె ఉస్మానియా ఆస్పత్రి అభివృద్ధికి ప్రభుత్వం ఇచ్చిన హమీలను అమలు చేయాలని గవర్నర్ ట్వీట్ చేశారు. ఉస్మానియా ఆసుపత్రికి ఎంతో గొప్ప చరిత్ర ఉందని.. ప్రస్తుతం ఆసుపత్రిని చూస్తుంటే బాధేస్తోందని చెప్పారు. అయితే ప్రభుత్వం ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణానికి సిద్ధంగా ఉందని.. కోర్టు పరిధిలో ఉండడం వల్ల ఇంకా పనులు చేపట్టలేదని మంత్రి హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు. ఈ క్రమంలో గవర్నర్ ఆస్పత్రిని విజిట్ చేయడం చర్చనీయాంశంగా మారింది.