Gaddar statue: గద్దర్‌ విగ్రహా ఏర్పాటుకు లైన్‌క్లియర్‌.. స్థలం కేటాయించిన రేవంత్‌ సర్కార్‌

Byline :  Veerendra Prasad
Update: 2024-01-30 10:55 GMT

తెలంగాణ ఉద్యమ గొంతుక.. ప్రజాయుద్ధ నౌక గద్దర్‌ విగ్రహ(Gaddar statue) ఏర్పాటుకు లైన్‌ క్లియర్‌ అయ్యింది. గద్దర్ విగ్రహం ఏర్పాటు చేయాలని తెల్లాపూర్ మున్సిపాలిటీ(Tellapur Municipality) చేసిన తీర్మానాన్ని హెచ్‌ఎండీఏ ఆమోదించింది. అవసరమైన స్థలాన్ని కేటాయిస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు పరిధి తెల్లాపూర్‌ మున్సిపాలిటీకి చెందిన భూమిలో గద్దర్‌ విగ్రహం ఏర్పాటు చేయాలని మున్సిపాలిటీ ఏకగ్రీవ తీర్మానం చేసింది. విగ్రహ ఏర్పాటు కావల్సిన స్థలం హెచ్‌ఎండీఏ పరిధిలోకి రావటంతో అనుమతులకు కొంత జాప్యం జరిగినట్లు తెలుస్తోంది. అయితే ఎట్టకేలకు గద్దర్‌ విగ్రహ ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వం స్థలం కేటాయించటం పట్ల గద్దర్‌ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ప్రజా యుద్ధ నౌకగా పేరుగడించిన గద్దర్ ఇటీవల అనారోగ్యం మరణించిన విషయం తెలిసిందే. ఆయన మరణించిన సమయంలో రాజకీయ పార్టీలు స్పందించిన తీరు అప్పట్లో చర్చకు దారి తీశాయి. అయితే టీపీసీసీ చీఫ్‌గా ఉన్న రేవంత్ రెడ్డి మాత్రం గద్దర్ అంతిమయాత్రలో అన్నీ తానై ముందుకు నడిపించారు. గద్దర్ మరణ వార్త తెలిసిన వెంటనే ఆస్పత్రికి చేరుకున్న రేవంత్.. భౌతికకాయాన్ని ఎల్బీస్టేడియంకు తరలించడం దగ్గర నుంచి అంతిమయాత్ర, అంత్యక్రియలు ఇలా అన్నింటిలో ముందుండి నిర్వహించారు. ప్రభుత్వ లాంఛనాలతో గద్దర్ అంత్యక్రియలు జరిగినప్పటికీ.. అక్కడ అన్నీ చూసుకుంది మాత్రం రేవంత్ రెడ్డే. అధికారంలోకి రాగానే ప్రజాకవి గద్దర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తానన్న రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు.

Tags:    

Similar News