Medigadda Barrage: మేడిగడ్డ బ్యారేజీపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
మేడిగడ్డ బ్యారేజీపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే మేడిగడ్డ ఘటనపై జ్యుడిషియల్ ఎంక్వయిరీ చేయిస్తామని ప్రకటించిన ప్రభుత్వం తాజాగా బ్యారేజీ కుంగుబాటుపై విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. దీంతో మంగళవారం విజిలెన్స్ అధికారులు ఈఎన్సీ కార్యాలయంలో తనిఖీలు చేపట్టారు. ఈఎన్సీ మురళీధర్ రావు కార్యాలయంలో కీలక పత్రాలను విజిలెన్స్ అధికారులు పరిశీలిస్తున్నారు. జ్యుడిషియల్ ఎంక్వయిరీ చేసేందుకు సిద్ధం అవుతున్న తరుణంలో ఆలోపు బ్యారేజీ కుంగుబాటుకు కారణాలు, బాధ్యులైన అధికారులను విజిలెన్స్ విచారణలో గుర్తించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు ఇరిగేషన్ శాఖ కార్యాలయంలో తనిఖీలు నిర్వహిస్తున్నారు. మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటు ఘటనను రేవంత్ రెడ్డి సర్కార్ సీరియస్‌గా తీసుకుంది. ఈ వైఫల్యం వెనుక కేసీఆర్ సర్కార్‌లో బాధ్యత ఎవరు అనేదానిపై ఫోకస్ పెట్టింది. ఇటీవలే మేడిగడ్డ బ్యారేజీని పరిశీలించిన మంత్రుల బృందం అక్కడే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ సైతం ఇచ్చింది. ఈ క్రమంలో విజిలెన్స్ విచారణకు ఆదేశించడం ఆసక్తికర పరిణామంగా మారింది.