Gruha Lakshmi : గృహలక్ష్మి పథకం రద్దు.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

Byline :  Veerendra Prasad
Update: 2024-01-03 02:45 GMT

తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేపట్టిన గృహలక్ష్మి పథకాన్ని రద్దు చేస్తూ రమంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే జిల్లా కలెక్టర్లు లబ్ధిదారులకు ఇచ్చిన మంజూరు పత్రాలను సైతం రద్దు చేస్తున్నట్లు పేర్కొంది. ఈ పథకం స్థానంలో అభయహస్తం కింద పేదల ఇళ్ల నిర్మాణం కోసం 5 లక్షల రూపాయలు అందించనున్నట్లు ప్రభుత్వం పేర్కొంది.

గత ముఖ్యమంత్రి కేసీఆర్.. సొంత స్థలం ఉన్నవారికి ఇళ్ల నిర్మాణం కోసం రూ.3 లక్షల ఆర్థిక సాయం అందించేందుకు గృహలక్ష్మి పథకాన్ని అమలు చేశారు. ఇందులో కొందరికి మంజూరు పత్రాలను కూడా జారీ చేశారు. ఇప్పుడు గృహలక్ష్మి రద్దుతో ఆ పత్రాలు కూడా రద్దు అవ్వబోతున్నాయి. తమ పార్టీ అధికారంలోకి వచ్చాక సొంత జాగా ఉన్నవారికి అభయహస్తం పథకం కింద రూ.5 లక్షల ఆర్థిక సాయం ఇస్తామని ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. దీనికి అనుగుణంగా ప్రజాపాలన కార్యక్రమంలో లబ్ధిదారుల నుంచి ప్రభుత్వం దరఖాస్తులను తీసుకుంటోంది. ఈ నేపథ్యంలో పాత పథకాన్ని రద్దు చేసింది.




 


ఇక ప్రస్తుతం.. ప్రజాపాలనలో 6 గ్యారంటీలకు ఒకటే అప్లికేషన్ తీసుకుంటున్నారు. అయితే ఇందులో మహాలక్ష్మి, రైతు భరోసా, గృహజ్యోతి, చేయూత, ఇందిరమ్మ ఇళ్లకుపెద్ద ఎత్తున దరఖాస్తులు వస్తున్నాయి. ఈ కార్యక్రమం జనవరి 6వ తేదీ వరకు కొనసాగనుంది. ఆ తర్వాత కూడా 6 గ్యారంటీల కోసం అప్లై చేసుకోవచ్చని, దీనికి ఇప్పుడే గడువు అయితే విధించలేదని ప్రభుత్వం చెప్పింది. అయినప్పటికీ ఈ పథకాల కోసం ఎన్నో ఏరియాల్లో కూడా ప్రజల నుంచి భారీ రెస్పాన్స్ వస్తోంది. 




Tags:    

Similar News