Animal Husbandry : పశుసంవర్ధక శాఖలో ఫైళ్లు మాయం .. తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం

Byline :  Veerendra Prasad
Update: 2024-01-16 07:46 GMT

నాంపల్లిలోని పశు సంవర్థక శాఖ కార్యాలయంలో ఫైళ్ల మాయం, గొర్రెల పంపిణీ పథకంలో జరిగిన అక్రమాలపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్‌గా ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. పశుసంవర్ధక శాఖ కేసులను తెలంగాణ ప్రభుత్వం ఏసీబీకి బదిలీ చేసింది. ఈ 2 కేసులను ఏసీబీకి బదిలీ చేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది. గొర్రెల పంపిణీ నిధుల బదిలీల్లో ఉన్నతాధికారుల ప్రమేయం ఉన్నట్లు తేలగా.. ఇప్పటికే పలువురిపై అక్రమాలపై కేసులు నమోదయ్యాయి. అయితే ఈ కేసును ఏసీబీకి బదిలీ చేయడంతో కేసులో ఏం జరగబోతుందనేది ఉత్కంఠగా మారింది.

గొర్రెల పంపిణీ పథకానికి సంబంధించి బినామీ పేర్లతో ఖాతాలు తెరిచి.. రూ.2.08కోట్లు దారి మళ్లించినట్లు ప్రాథమికంగా అధికారులు నిర్ధారించారు. నిధుల మళ్లింపు వ్యవహారంలో నలుగురు అధికారులు, ఇద్దరు గొర్రెల దళారులపై ఇప్పటికే గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేశారు. ఇప్పటికే పోలీసులు కొంతమేర దర్యాప్తు చేపట్టినా మరింత లోతైన దర్యాప్తు అవసరమని భావించిన ప్రభుత్వం.. ఈ కేసును ఏసీబీకి అప్పగించింది. మరోవైపు ఫైళ్ల మాయం ఘటనపై రాష్ట్ర పశు సంవర్థక శాఖ మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ పేషీలో ఓఎస్డీగా పనిచేసిన కల్యాణ్‌ కుమార్‌ ప్రమేయంపైనా పోలీసుల విచారణ కొనసాగుతోంది. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అమలులోకి తెచ్చిన గొర్రెల పంపిణీ పథకం అవినీతి, అక్రమాలకు కేంద్ర బిందువుగా మారిన విషయం విదితమే.




Tags:    

Similar News