9 ఏళ్ల తెలంగాణలో క్రీడలకు పెద్దపీట...

Update: 2023-05-31 11:30 GMT

కోటి ఆశలతో ఏర్పడిన తెలంగాణ.. అభివృద్ధి పథంలో దూసుకుపోతోంది. అద్భుత ప్రగతి సాధిస్తూ దేశంలో మిగిలిన రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోంది. సీఎం కేసీఆర్ హయాంలో అన్ని రంగాలతో పాటు క్రీడారంగానికి కూడా పెద్దపీట వేశారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణ క్రీడాకారులు తమ ప్రతిభ చాటుతున్నారంటే దాని వెనుక ప్రభుత్వం అందించిన ప్రోత్సాహం ఎంతగానో ఉంది. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డాక మారుమూల గ్రామాల్లో ఉన్న ప్రతిభావంతులు లోకానికి పరిచయమవుతున్నారు. సర్కార్ అందించిన ప్రోత్సాహాన్ని వినియోగించుకుంటూ తెలంగాణ ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేస్తున్నారు. ఇప్పటికే నిఖత్‌జరీన్‌, ఇషాసింగ్‌, ఆకుల శ్రీజ, నందిని, హుసాముద్దీన్‌, గొంగడి త్రిష లాంటి ప్లేయర్లు అదరుగొడుతుండగా..మరికొందరు సత్తా చాటేందుకు సిద్ధంగా ఉన్నారు. ఈ 9 ఏళ్లలో తెలంగాణ రాష్ట్రం క్రీడారంగంలో విశేష ప్రగతి సాధించింది.




 మౌళిక సదుపాయాలు




 తెలంగాణ ప్రభుత్వ ఏర్పాటు...గ్రామీణ క్రీడాకారులకు వరంగా మారింది. ఈ 9 ఏళ్లలో వందల మంది క్రీడాకారులు తమ ప్రతిభను లోకానికి చాటి చెప్పారు. ప్రభుత్వ ప్రోత్సాహంతో మారుమూల గ్రామాల నుంచి క్రీడాకారులు పుట్టుకొస్తున్నారు. స్కూళ్లస్థాయి నుంచి రాష్ట్ర ప్రభుత్వం అన్ని క్రీడలకు పెద్ద పీట వేస్తోంది.మారుమూల ప్రాంతాల్లోనూ మైదానాలను అందుబాటులోకి తెస్తున్నారు. ప్రతి పాఠశాలకు పీఈటీని నియమించారు.క్రికెట్, ఫుట్ బాల్ వంటి ఆటలనే కాకుండా ప్రతి ఆటను, ఆటగాళ్లకు ప్రోత్సాహం అందుతుంది. తెలంగాణ వచ్చాక కబడ్డీ, ఖోఖో, వాలీబాల్‌, బాస్కెట్‌ బాల్‌ ఆడేవారు బాగా పెరిగడమే దీనికి నిదర్శనం




 


నియోజకవర్గంలో స్టేడియాలు

ప్రతిభావంతులు వెలికితీసే క్రమంలో ప్రభుత్వం ప్రతీ నియోజకవర్గంలో స్టేడియాలు నిర్మిస్తోంది. జాతీయ, అంతర్జాతీయ టోర్నీలకు తెలంగాణ ప్లేయర్లను సిద్ధం చేయాలన్న ఏకైక లక్ష్యంతో.. అనుభవజ్ఞులైన కోచ్‌లను నియమించి మట్టిలో మాణిక్యాలను తీర్చిదిద్దుతోంది. ఇందుకుతోడు ప్రతీ గ్రామంలో క్రీడా ప్రాంగణాలు వెలిశాయి. మట్టిలో మాణిక్యాలను వెలికితీయడమే లక్ష్యంగా గ్రామ, మండల, జిల్లా స్థాయిలో పోటీలు నిర్వహిస్తున్నారు. గెలిచిన విజేతలకు నగదు ప్రోత్సాహకాలు అందించడం జరుగుతోంది.




 క్రీడాకారులకు ప్రోత్సాహకం

క్రీడాకారులను రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహించడంతో పాటు ప్రోత్సాహకాలు అందించి ఎంతోమంది క్రీడాకారులకు ఈ 9 ఏళ్లలో అండగా నిలుస్తోంది. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గెలుపొందిన విజేతలకు ప్రోత్సాహకాలు ఇచ్చి..వారు మరింత ఎదిగేలా సంపూర్ణ సహకారం తెలంగాణ సర్కార్ అందిస్తోంది. ఇప్పటికే విశ్వవేదికపై తెలంగాణ ఖ్యాతిని చాటి చెప్పిన భాక్సర్ నిఖత్ జరీన్‌కు కేసీఆర్ రూ.2 కోట్లు ఇచ్చి.. జూబ్లీహిల్స్‌లో 600 గజాల స్థలాన్ని కేటాయించారు. ఒలింపిక్ క్రీడల్లో పాల్గొనేందుకు తీసుకునే శిక్షణ, కోచింగ్, రవాణా తదితర ఖర్చులను రాష్ట్ర ప్రభుత్వం భరించేందుకు ముందుకొచ్చింది. పిన్న వయుస్సులోనే చెస్ గ్రాండ్ మాస్టర్ హోదా సాధిం చిన తెలంగాణ క్రీడాకారుడు ఉప్పల్ ప్రణీత్ కు రూ.2.5 కోట్లు, మరో చెస్ క్రీడాకారణి వీరపల్లి నందినికి రూ.50 లక్షల అర్థిక సాయం అందించారు. 

అంతర్జాతీయ పోటీలు

తెలంగాణ ప్రభుత్వం హయాంలో అనేక అంతర్జాతీయ క్రీడలను హైదరాబాద్ వేదికగా నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం వేదికగా నేషనల్ క్రికెట్‌, ఐపీఎల్ మ్యాచ్‌లను సమర్థవంతంగా నిర్వహిస్తోంది. ఎటువంటి ఆటంకాలు లేకుండా అన్ని సౌకర్యాలను కల్పిస్తున్నారు. అదేవిధంగా దేశంలో మొట్ట మొదటిసారిగా ఫార్ములా-ఈ కార్ రేసింగ్ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌కు హైదరాబాద్ ఆతిథ్యం ఇచ్చింది. భారత్‌లో ఎలక్ట్రిక్ కార్ల మధ్య ఫార్ములా రేసింగ్ నిర్వహించడం ఇదే తొలిసారి. ప్రస్తుతం న్యూయార్క్, లండన్, బెర్లిన్, రోమ్, సియోల్‌లల్లో మాత్రమే ఈ ఫార్ములా-ఈ రేసింగులు నడుస్తున్నాయి. వాటి సరసన హైదరాబాద్‌కు కూడా చేరిందంటే తెలంగాణ ప్రభుత్వం చలవే.



Tags:    

Similar News