పులి కోసం రెండు ఊళ్లు ఖాళీ.. తెలుగు రాష్ట్రాల్లో తొలిసారిగా..
డ్యామ్‌ల నిర్మాణం కోసం ఊళ్లను ఖాళీ చేయిస్తుంటారు. పరిశ్రమలు, రైలు మార్గాలు, విమానాశ్రయాలు తదితర ప్రాజెక్టుల కోసం కూడా ఊళ్లను ఖాళీ చేయిస్తుంటారు. పుట్టి పెరిగిన ఇళ్లను, పొలాలను విడిచి జనం గుండెబరువుతో ఇతర ప్రాంతాలకు శాశ్వతంగా వలస పోతుంటారు. కానీ పులుల కోసం తట్టుబుట్టా చేతబట్టుకుని ఉన్న ఊరిని విడిచిపోవడం చాలా అరుదు. తెలుగు నాట అలాంటి ఉదంతం తొలిసారిగా చోటుచేసుకుంటోంది.
పులులు తిరగడానికి చోటు కల్పించేందుకు రెండు ఊళ్లు ఖాళీ అవుతున్నాయి. నిర్మల్ జిల్లాలోని కవ్వాల్ టైగర్ రిజర్వు నుంచి పల్లెల తరలింపునకు అధికారులు అన్నీ సిద్ధం చేశారు. కడెం మండలం మైసంపేట, రాంపూర్ గ్రామాల ప్రజలను నెల రోజుల్లో ఆ మండలంలోనే ఉన్న ధర్మాజిపేటకు తరలించనున్నారు. ధర్మాజీపేటలో వీరి కోసం డబుల్ బెడ్రూం ఇళ్లను ఇప్పటికే నిర్మించారు. తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దుల్లో తిరిగే పులులకు మరింత స్వేచ్ఛ కల్పించడానికి ఈ ప్రాజెక్ట్ చేపట్టారు. దీని వ్యయం 24 కోట్లు. ఇది విజయవంతమైతే మరిన్ని కవ్వాల్ నుంచి మరికొన్ని పల్లెలను, చెంచుపెంటలను కూడా ఇతర ప్రాంతాలకు తరలిస్తారు. ధర్మాజిపేట కూడా కవ్వాల్ టైగర్ రిజర్వులోని ఉన్నా పెద్దపులులు తిరిగే కోర్ ఏరియాకు బయటే ఉంది.
కవ్వాల్ టైగర్ రిజర్వులోని కోర్ ఏరియాకు పెద్దపులులు పెద్ద సంఖ్యలో వస్తున్నాయి. అయితే జన సంచారం, వాహనాల రొద్ద వంటి కారణాలతో తిరిగి వెళ్లిపోతున్నాయి. కవ్వాల్ కోర్ ఏరియా మార్గంలో పది పెద్ద పులులు తిరుగుతున్నాయి. పెద్దపులుల సంఖ్యను పెంచాలని కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు సంకల్పించిన నేపథ్యంలో అవి కవ్వాల్‌లో స్థిరనివాసం ఏర్పాటు చేసుకునే అవకాశం కల్పించాల్సి ఉంది. దీనికి వీలుగా మైసంపేట, రాంపూర్ గ్రామాలను ఖాళీ చేయించి కుంటలు తవ్వుతారు. పల్లెలను పచ్చిక బీళ్లుగా మారుస్తారు. దీని వల్ల పులులు ఎలాంటి ఇబ్బందీ లేకుండా తిరుగుతాయి. గడ్డి, నీటివనరులు ఉండడంతో జింకలు, కొండగొర్రులు, అడవిదున్నలు వంటి శాకాహార జంతువులు అక్కడికి చేరుకుంటాయి. వాటని వేటాడడానికి పులులు కూడా వచ్చి స్థిర నివాసం ఏర్పరచుకుంటాయి.
కవ్వాల్ కోర్ ఏరియాలో ప్రస్తుత 37 గ్రామాలు ఉన్నాయి. ఖాళీ చేయడానికి ముందుకొచ్చే కుటుంబాలకు ప్రభుత్వాలు మెరుగైన పునరావాస ప్యాకేజీని అందిస్తున్నాయి. మైసంపేట, రాంపూర్ ప్రజలకు ధర్మాజీపేటలో పునరావాసం కల్పించేందుకు 276 ఎకరాల అటవీభూములను డీనోటిఫై చేశారు. రెండు గ్రామాల్లో 142 కుటుంబాలు ఉన్నాయి. 48 కుటుంబాలు పరిహారం కింద ఒకేసారి రూ. 15 లక్షల ప్యాకేజీ తీసుకున్నాయి. 94 కుటుంబాలు డబుల్ బెడ్రూం ఇళ్లను, 2.81 ఎకరాల చొప్పున సాగుభూమి తీసుకున్నాయి. కవ్వాల్ టైగర్ రిజర్వ్ గ్రామాల తరలింపు ఫలితాలు ఆశాజనకంగా ఉంటే ఉమ్మడి పాలమూరు జిల్లాలోని ఆమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌లోనూ ఇలాంటి ప్రాజెక్టును చేపడతారు.
పులుల కోసం ఊళ్లను ఖాళీ చేయించడం చిత్రంగా ఉన్నా వన్య ప్రాణుల సంరక్షణలో దీనికి కీలక పాత్ర ఉంది. అటవీభూములు రోజురోజుకూ కుంచించుకుపోతుండడంతో అడవి జంతువులు తిండితిప్పలు లేక ఆకలిచావులకు గురవుతున్నాయి. కొన్ని ఊళ్లమీదపడి దాడి చేస్తుంటే, కొన్నింటిని స్మగ్లర్లు హతమారుస్తున్నాయి. జాతీయ మృగమైన పెద్దపులుల సంఖ్యను పెంచడానికి కేంద్రం కోట్ల నిధులు వెచ్చిస్తోంది. పులుల సంఖ్యలోనే కాదు, వాటి సంరక్షణలోనూ అగ్రస్థానంలో ఉండాలని చర్యలు చేపడుతోంది.