హెచ్‌ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణపై సస్పెన్షన్ వేటు
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో హెచ్ఎండీఏ(HMDA) మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ(Shiva Balakrishna)పై తెలంగాణ ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది. ఈ మేరకు ఆయనను సస్పెండ్ చేస్తూ పురపాలక శాఖ ప్రిన్స్‌పల్ సెక్రటరీ దాన కిషోర్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం చంచల్‌గూడ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. కాగా.. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టిన ఘటనలో అరెస్ట్ అయిన శివబాలకృష్ణ లీలలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. హైదరాబాద్ నగర శివార్లలో జరిగిన భూ బదలాయింపులు, అపార్ట్‌మెంట్స్, విల్లాల నిర్మాణాల్లో ఒక్క సంతకంతో స్థలాలు కాజేశారంటూ పలువురు బాధితులు ఆయనపై ఆరోపణలు చేస్తున్నారు. వారిలో కొందరు ఏసీబీలో సైతం ఫిర్యాదు చేయడం గమనార్హం.
గత వారం ఏసీబీ అధికారులు శివబాలకృష్ణ( ఇంట్లో భారీ ఎత్తున నగదు, బంగారం, ఖరీదైన వాచీలు, మొబైల్స్ స్వాధీనం చేసుకున్నారు. దాంతో తెలంగాణ ప్రభుత్వం శివబాలకృష్ణను సర్వీస్ నుంచి తప్పిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. పదవిని అడ్డుకుని వందల కోట్లు సంపాదించారని ఆయన అభియోగాలు ఎదుర్కొంటున్నారు. ఆయనతో పని చేసే అధికారులను కూడా ఏసీబీ అధికారులు విచారించనున్నారు. మొదటి నుంచి ఆయనతో కలిసి పని చేసే ఉద్యోగులందరికీ నోటీసులు ఇచ్చారు. వారిని విచారించి ఇంకా పూర్తి వివరాలు రాబట్టనున్నారు. ఇప్పటికే శివ బాలకృష్ణకు సంబంధించిన నివాసాల్లో సోదాలు చేశారు. ఆయన బినామి ఆస్తులు కూడా గుర్తించారు. బినామీలను సైతం విచారించి మరింత మందిని అదుపులోకి తీసుకోనున్నారు. ఇప్పుడు ఆయనతో పని చేసే ఉద్యోగులను విచారిస్తే ఇంకా ఎన్ని సంచలనాలు బయటకు వస్తాయో అన్న ఆసక్తి నెలకొంది.