ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసే బిల్లుకు తాను వ్యతిరేకం కాదని తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ స్పష్టం చేశారు. ఆదివారంనాడు హైద్రాబాద్ లో తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ మీడియాతో మాట్లాడారు. ఆర్టీసీ బిల్లుపై కొన్ని విషయాలపై స్పష్టత కోసం రవాణా శాఖ అధికారులతో రాజ్‌భవన్‌లో కాసేపటి క్రితమే సమావేశమయ్యారు. బిల్లు వెనక్కి పంపడానికి కారణాలు, బిల్లుపై ఉన్న సందేహాలపై గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ వారితో చర్చిస్తున్నారు. ఆర్ అండ్ బీ కార్యదర్శి, అధికారులకు మధ్యాహ్నం వరకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సమయం ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో గవర్నర్ అధికారులతో ఏం చర్చించనున్నారనే దానిపై ఆసక్తి నెలకొంది.
మరోవైపు నేటితో సమావేశాలు ముగియనుండడంతో ఈరోజు సభలో వివిధ అంశాలపై వాడీవేడిగా చర్చలు జరిగే అవకాశం ఉంది. ఈ క్రమంలో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ సభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డితో సమావేశమయ్యారు. ఆర్టీసీ బిల్లు అంశంపై సభాపతి, మంత్రి పువ్వాడ అజయ్ చర్చించారు. గవర్నర్ అనుమతి ఇస్తే వెంటనే ప్రభుత్వం ఆర్టీసీ బిల్లును సభలో ప్రవేశపెట్టాలని భావిస్తోంది. ఇవాళ్టితో అసెంబ్లీ సమావేశాలు ముగియనుండగా ఆర్టీసీ బిల్లు విషయంలో గవర్నర్ తీసుకునే నిర్ణయంపై అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.