Governor Tamilisai : వాళ్లేమన్నా సైంటిస్టులా, సంఘసేవకులా? తమిళిసై రీట్వీట్

Byline :  Mic Tv Desk
Update: 2023-09-25 17:12 GMT

తెలంగాణ గవర్నర్ తమిళిసౌ సౌందరరాజన్ తన తిరస్కరణ నిర్ణయంపై స్పందించారు. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా ప్రభుత్వం ఆమోదించిన దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణల పేర్లను ఎందుకు తిరస్కరించాల్సి వచ్చిందో వెల్లడించారు. ప్రభుత్వానికి రాసిన లేఖలో అన్ని అంశాలూ పొందుపరిచానని విజయవాడలో విలేకర్లతో అన్నారు. తాను కారణం లేకుండా ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాలను తిరస్కరించానని అన్నారు. రాత్రి పొద్దుపోయాక తన నిర్ణయాన్ని సమర్థిస్తూ కొందరు జర్నలిస్టులు చేసిన ట్వీట్లను ఆమె రీట్వీట్ చేశారు. ‘‘గవర్నర్ నిర్ణయం 100 శాతం కరెక్ట్. అధికార పార్టీ నామినేట్ చేసినవారు ఏమైనా సైంటిస్టులా? సాహితీవేత్తలా? సంఘసేవకులా?’’ అని ఓ జర్నలిస్ట్ ప్రశ్నించారు.

అర్హతలను పరిగణనలోకి తీసుకోకుండా రాజకీయ సంబంధాలను దృష్టిలో ఉంచుకుని సిఫార్సు చేయడం సరికాదని గవర్నర్ అంతకు ముందు ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబట్టారు. ఎమ్మెల్సీ పదవులకు అర్హులైన వారు రాష్ట్రంలో ఎందరో ఉన్నారన్న ఆమె ఎమ్మెల్సీలుగా ఎవరిని నియమించకూడదో చట్టంలో స్పష్టంగా ఉందన్నారు. కాగా, గవర్నర్ ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తున్నారని మంత్రి శ్రీనివాస్ గౌడ తీవ్ర విమర్శలు చేశారు. తమిళనాడు బీజేపీ అధ్యక్షురాలైన తమిళిసై నేరుగా గవర్నర్ పదవి చేపట్టారని, రాజకీయాల్లో ఉన్న దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణలను ఎమ్మెల్సీలు కాకుండా అడ్డుపడుతున్నారని మండిపడ్డారు.   

Tags:    

Similar News