KCR : ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్

Byline :  Veerendra Prasad
Update: 2023-10-09 02:22 GMT

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం కేసీఆర్‌ తీపికబురు అందించారు. ఉద్యోగులు, పింఛనర్ల కోసం ఎంప్లాయిస్‌ హెల్త్‌ కేర్‌ ట్రస్ట్‌( Employee Health Care Trust)ను ఏర్పాటు చేశారు. నూతన ఎంప్లాయిస్‌ హెల్త్‌ స్కీమ్‌ అమలుకు సీఎం కేసీఆర్‌ ఆదేశాలు జారీ చేశారు. దీని ద్వారా ఉద్యోగులు, పింఛనర్లతో పాటు కుటుంబసభ్యులకూ ప్రయోజనం కలగనుంది. ఈ మేరకు వైద్యారోగ్య శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఉద్యోగులు, పెన్షనర్ల కోసం ప్రత్యేక ఆరోగ్య పథకం అమలు చేయాలని మొద‌టి పీఆర్సీ క‌మిష‌న్ ప్రభుత్వానికి సూచించింది. ప‌థ‌కం అమ‌లుకు ప్రత్యేక ట్రస్టు ఏర్పాటు చేసి ఉద్యోగులు, పెన్షనర్ల నుంచి కొంత మొత్తాన్ని, అంతే మొత్తంలో ప్రతి నెలా ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్‌గా జ‌మ చేయాల‌ని చెప్పింది.

త‌మ మూల వేతనంలో ఒక శాతం కాంట్రిబ్యుషన్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని ఉద్యోగ సంఘాల ప్రతినిధులు ప్రభుత్వానికి గ‌తంలో వెల్లడించారు. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్‌ ఆదేశం మేరకు మంత్రి హరీశ్ రావు నేతృత్వంలో ఆరోగ్యశ్రీ హెల్త్‌కేర్‌ ట్రస్ట్‌ సీఈవో పలుమార్లు ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో చర్చలు జరిపారు. వారి ప్రతిపాదనలను పరిశీలించారు. అనంతరం ప్రభుత్వానికి నివేదిక అందజేశారు. దీని ప్రకారం.. ఈహెచ్‌ఎస్‌ అమలు కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా ఎంప్లాయీ హెల్త్ కేర్ ట్రస్ట్ (ఈహెచ్‌సీటి) పేరుతో ట్రస్ట్ ఏర్పాటు చేస్తుంది.

పథకం నిర్వహణకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో బోర్డును ఏర్పాటు చేశారు. సీఎస్‌ చైర్‌ పర్సన్‌గా ఉంటారు. ప్రభుత్వం తరఫున.. ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, విద్యాశాఖ, సాధారణ పరిపాలన, వైద్యారోగ్య శాఖ, హోం శాఖ ముఖ్య కార్యదర్శలు, డైరెక్టర్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ (డీఎంఈ), ఆరోగ్య శ్రీ ట్రస్ట్‌ సీఈవో సభ్యులుగా ఉంటారు. ఈహెచ్‌ఎస్‌ సీఈవో సభ్య కార్యదర్శిగా వ్యవహరిస్తారు.నూతన విధానంతో ఉద్యోగులు, పింఛనర్లు, కుటుంబీకులకు మెరుగైన వైద్య సేవలు లభించనున్నాయి. ఉద్యోగులు, పింఛనర్ల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు మంత్రి హరీశ్ రావు. ఎంప్లాయిస్‌ హెల్త్‌ స్కీమ్‌ ప్రకటించిన సీఎంకు టీఎన్‌జీవో అధ్యక్షుడు రాజేందర్‌ కృతజ్ఞతలు తెలిపారు.




Tags:    

Similar News