Good News: ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు

Update: 2023-10-03 02:50 GMT

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల (Govt Employees) కు కేసీఆర్ సర్కార్ గుడ్ న్యూస్ తెలిపింది. ఉద్యోగులకు పే స్కేల్‌ (Pay Scale) చెల్లింపు కోసం కొత్త వేతన సవరణ కమిషన్‌(PRC) ని సీఎం కేసీఆర్‌ నియమించారు. పీఆర్సీ నివేదిక వచ్చేంత వరకు మూల వేతనంపై 5 శాతం మధ్యంతర భృతి (ఐఆర్‌) చెల్లించనున్నట్టు ప్రభుత్వం తెలిపింది. అక్టోబర్‌ నెల నుంచే ఐఆర్‌ను వర్తింపజేయనున్నట్టు పేర్కొన్నది. సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి శివశంకర్‌ చైర్మన్‌గా పీఆర్సీ కమిటీని నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి సోమవారం జీవో -159 జారీచేశారు. ఈ కమిటీలో సభ్యుడిగా మరో రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి బీ రామయ్యకు చోటు కల్పించారు. ఈ కమిటీ ఆరు నెలల్లోపు ప్రభుత్వానికి నివేదిక అందజేయాలని నిర్దేశించారు. పీఆర్సీకి బాధ్యతలు నిర్వర్తించేందుకు కావాల్సిన నిధులను, సిబ్బందిని సమకూర్చాలని ఆర్థిక శాఖను ఆదేశించారు.

ఉద్యోగుల వేతన సవరణపై గతంలో ప్రభుత్వం నియమించిన సీఆర్‌ బిశ్వాల్‌ కమిషన్‌ గడువు ఈ ఏడాది జూన్‌ 30తో ముగిసింది. కేవలం నాలుగు నెలల వ్యవధిలోనే అత్యంత వేగంగా కొత్త పీఆర్సీని ప్రభుత్వం నియమించింది. ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీ నియమించాలని నిర్ణయం తీసుకున్నందుకు గానూ.. సీఎం కేసీఆర్‌కు టీఎన్జీవోస్ కేంద్ర అధ్య‌క్ష‌, ప్ర‌ధాన కార్య‌ద‌ర్శులు మామిళ్ల రాజేంద‌ర్‌, మారం జ‌గ‌దీశ్వ‌ర్ కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. పీఆర్సీ క‌మిటీ ఛైర్మ‌న్‌గా రిటైర్డ్ ఐఏఎస్ ఎన్ శివశంకర్, సభ్యుడిగా రిటైర్డ్ ఐఏఎస్‌ బీ రామయ్యల‌ను నియమించ‌డంతో పాటు మధ్యంతర భృతి ప్ర‌క‌టించినందుకు రాష్ట్ర ఉద్యోగ, ఉపాధ్యాయులు, పెన్షనర్ల‌ పక్షాన ధన్యవాదాలు తెలుపుతున్న‌ట్లు ఓ ప్రకటనలో పేర్కొన్నారు

Tags:    

Similar News