విద్యార్థులకు అలర్ట్.. తెలంగాణలో రేపు 6.30 వరకు స్కూళ్లు..
జాబిల్లిపై చంద్రయాన్-3 అడుగుపెట్టే చారిత్రక క్షణాల కోసం యావత్ దేశం వేయికళ్లతో ఎదురుచూస్తుంది. మరి కొన్ని గంటల్లో చంద్రుడిపై చంద్రయాన్-3 ల్యాండర్ ల్యాండింగ్ కానుంది. అన్ని దశలను విజయవంతంగా దాటుకుంటూ దూసుకెళ్లిన చంద్రయాన్-3.. బుధవారం సాయంత్రం 6:04 గంటలకు చంద్రుడిపై దిగనుంది. దీన్ని కోసం ప్రపంచం మొత్తం ఉత్కంఠంగా ఎదురుచూస్తోంది. ఇక చందమామపై విక్రమ్ ల్యాండర్ దిగే అద్భుత ఘట్టాన్ని విద్యార్థులకు చూపించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
విద్యార్థుల కోసం స్కూళ్లు, కాలేజీల్లో లైవ్ స్ట్రీమింగ్ ఏర్పాటు చేయాలని అధికారులను విద్యాశాఖ ఆదేశించింది. ఈ మేరకు టీ శాట్, నిపుణలో లైవ్ టెలికాస్ట్‌కు ఏర్పాట్లు చేస్తున్నారు. దీనికి సంబంధించి డీఈవోలకు, ప్రిన్సిపల్స్‌కు స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వ స్కూళ్లలో ప్రత్యేక స్క్రీన్‌లు, ప్రొజెక్టర్‌లను సిద్ధం చేస్తున్నారు. బుధవారం సాయంత్రం 5.20 గంటల నుంచి టీ శాట్, నిపుణ ఛానెళ్లలో లైవ్ ప్రారంభమవుతుంది.
కాగా చంద్రయాన్ - 3 ల్యాండింగ్ మాడ్యూల్ సాఫ్ట్ ల్యాండింగ్ అయ్యే క్రమంలో చివరి 17 నిమిషాలు ఎంతో కీలకమని ఇస్రో శాస్త్రవేత్తలు చెప్తున్నారు. బుధవారం సాయంత్రం 5.45 గంటలకు ల్యాండింగ్ ప్రక్రియ ప్రారంభం కానున్నట్లు అంచనా వేస్తున్నారు. సూర్యుడి వెలుతురు రాగానే నిర్దేశిత ప్రదేశంలో, అనుకున్న టైంకు ల్యాండింగ్ చేపట్టనున్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. ల్యాండింగ్ ప్రక్రియ పూర్తిగా స్వతంత్రమైంది. ల్యాండర్ దాని పని అదే చేసుకోవాలి. సరైన ఎత్తులో, సరైన టైంలో, సరిపడా ఇంధనాన్ని ఉపయోగించుకుని ల్యాండర్ తన ఇంజిన్లను మండించుకోవాలి. దాని తర్వాత సురక్షిత ల్యాండింగ్ కోసం సేఫ్ ప్లేస్ను స్కాన్ చేసి కిందకు ల్యాండ్ కావాల్సి ఉంటుంది.