Notary Lands Regularization G.O : నోటరీ స్థలాలు కొన్నవారికి హైకోర్టు షాక్..
నోటరీ స్థలాల క్రమబద్ధీకరణ వ్యవహారంలో తెలంగాణ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. వీటిని క్రమబద్ధీకరించాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంపై మధ్యంతర స్టే విధించింది. దీంతో నోటరీ స్థలాల రిజిస్ట్రేషన్లు ఆగిపోనున్నాయి. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరికాదంటూ భాగ్యనగర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ హైకోర్టులో పిటిషన్ వేసింది. క్రమబద్ధీకరణకు సంబంధించిన జీవో నెం.84ను పూర్తిగా పరిశీలించిన కోర్టు దీనిపై వివరణ ఇవ్వాలని ఇదివరకే సర్కారును ఆదేశించింది. సోమవారం మరోసారి విచారణ జరిపి స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ ఉత్తర్వులు స్టాంపులు, రిజిస్ట్రేషన్ల చట్టంలోని సెక్షన్ 9కి ఈ జీవో నిబంధనలు విరుద్ధంగా ఉన్నాయని కోర్టు అభిప్రాయపడిది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకూ జీవో ను అమలు చేయొద్దని ఆదేశాలు జారీ చేసింది.
నోటరీ ప్రక్రియలో కొన్న భూములను నిర్ణీత స్టాంపు డ్యూటీ చెల్లించి రెగ్యులరైజ్ చేసుకునేందుకు వీలుగా ప్రభుత్వం ఈ ఏడాది జులై 26న జీవో 84ను తీసుకొచ్చింది. 3 వేల గజాల్లోపు నోటరీ స్థలాలకు ఈ జీవో వర్తిస్తుంది. పట్టణ ప్రాంతాల్లో 125 గజాల్లోపు నోటరీ స్థలాలను ఉచితంగా నమోదు చేసేకోవచ్చు. అంతకు మించిన విస్తీర్ణం ఉన్న భూములకు స్టాంపు డ్యూటీ చెల్లించాల్సి ఉంటుంది. క్రమబద్ధీకరణ కోస దరఖాస్తుతో పాటు నోటరీ డాక్యుమెంట్, ఆస్తి తాలూకు లింకు డాక్యుమెంట్లు, ఆస్తిపన్ను రసీదులు, కరెంటు, వాటర్ బిల్లులు, ఆస్తి స్వాదీనంలో ఉన్నట్టు రుజువు చేసే ఇతర ధ్రువపత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. దరఖాస్తులను జిల్లా కలెక్టర్ పరిశీలించి నిర్ణయం తీసుకుంటారు.