మండుటెండల నుంచి ఉపశమనం.. మరో రెండ్రోజుల్లో వానలు

Update: 2023-06-18 05:26 GMT

మండుటెండలు, ఉక్కపోతతో సతమతమవుతున్న జనాలకు వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. రెండు రోజుల్లో వర్షాలు కురుస్తాయని ప్రకటించింది. వాతావరణ పరిస్థితుల్లో మార్పు వచ్చినందున రుతుపవనాల కదలికలకు అనువైన పరిస్థితులు ఏర్పడ్డాయని అధికారులు చెప్పారు. అయితే రుతువనాల విస్తరణకు మాత్రం మరింత సమయం పట్టే అవకాశముందని అన్నారు.. రెండు రోజులు ఎండలు భరిస్తే చాలని తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు ప్రారంభమవుతాయని ప్రకటించారు.

తుఫాను ప్రభావంతో

అరేబియా సముద్రంలో ఏర్పడిన బిపోర్జాయ్ తుఫాను కారణంగా నైరుతి రుతుపవనాల కదలిక నెమ్మదించింది. గతవారమే ఏపీలోకి ప్రవేశించినా వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో విస్తరించలేదు. దీంతో ఎండలు, వడగాల్పుల తీవ్రత ఎక్కువైంది. ఈ క్రమంలో ఈ నెల 19 నుంచి తిరుపతి, శ్రీ సత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు, వైఎస్సాఆర్ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని, మరికొన్ని చోట్ల భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ చెప్పింది.

21నాటికి ఏపీ అంతటా వానలు

ఈ నెల 21నాటికి రుతుపవనాలు ఏపీ అంతటా విస్తరిస్తాయని అధికారులు అంటున్నారు. అదే సమయంలో ఇటు తెలంగాణలోనూ వర్షాలు ప్రారంభమవుతాయని చెబుతున్నారు. రుతుపవనాల ప్రభావంతో రానున్న రెండు రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు, తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.

రెండ్రోజుల్లో ఉపశమనం

ఇదిలా ఉంటే తెలంగాణలో మరో రెండు రోజుల పాటు ఎండల తీవ్రత కొనసాగనుంది. పశ్చిమ దిశ నుంచి వీస్తున్న దిగువ స్థాయి గాలుల ప్రభావంతో పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల వరకు నమోదవుతున్నాయి. గాలిలో తేమ శాతం తగ్గడంతో పొడి వాతావరణం నెలకొని ఉక్కపోతతో జనం అల్లాడుతున్నారు. ఈ క్రమంలో మరో రెండు రోజుల్లో వర్షాలు పడతాయన్న వాతావరణ శాఖ ప్రకటన జనాలకు కాస్త రిలీఫ్ ఇచ్చింది. 

Tags:    

Similar News