తెలంగాణ ఆర్టీసీ బస్సు చోరీ... దారి మధ్యలో అదిరిపోయే ట్విస్ట్...

Byline :  Lenin
Update: 2023-09-12 05:22 GMT

బైకులను, స్కూటీలను కొట్టేస్తే ఏమొస్తుంది? దొంగసొత్తు కాబట్టి పది వేలో, ఇరవై వేలో! అందుకే కొడితే లగ్జరీ కారునో, వీలైతే విమానాన్నో కొట్టాలి! సిద్దిపేటలో ఓ దొంగ అలాంటి అత్యాశతో ఏకంగా ఆర్టీసీ బస్సునే కొట్టేశాడు. అయితే దారి మధ్యలో కర్మకాలి దొరికిపోయాడు. సిద్దిపేట డిపోలో పనిచేస్తున్న స్వామి అనే డ్రైవర్ ఆదివారం రాత్రి ఆర్టీసీ అద్దె బస్సును నడిపి డిపోలో ఉంచి వెళ్లాడు. అయితే తాళాలను బస్సులోనే ఉంచాడు. దీన్ని గమనించిన బందెల రాజు అనే యువకుడు బస్సెక్కి రయ్యమని వేములవాడ బస్టాండు చేరుకున్నాడు. బస్సును హైదరాబాద్ పాయింటులో పార్క్ చేసి... సిరిసిల్ల to జేబీఎస్ బోర్డు పెట్టి హైదరాబాద్ వెళ్తోందని చెప్పాడు. కొందరు ప్రయాణికులు నిజమేనని బస్సెక్కారు. టిక్కెట్లు కొట్టమని రాజును అడగ్గా కండక్టర్ దారి మధ్యలో ఎక్కి కొడతాడని చెప్పాడు. బస్సు తంగళ్లపల్లి మండలం సారంపెల్లి నేరెళ్ల గ్రామ శివారులోకి రాగానే డీజిల్ అయిపోయింది. దీంతో రాజు చేసేదేం లేక బస్సు దిగాడు. పర్యాణికులను వేరే బస్సు ఎక్కి వెళ్లమని చెప్పి పారిపోయాడు. ప్రయాణికుల ఫిర్యాదులో పోలీసులు రంగంలోకి దిగి రాజును అరెస్ట్ చేసి కోర్టుకు హాజరు పరిచారు. రాజుది సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట అని, గతంలో ఏవైనా నేరాలు చేశాడా అని ఆరా తీస్తున్నామని చెప్పారు.

Tags:    

Similar News