కేసీఆర్ అంటే ఓ నమ్మకమని, తెలంగాణ ఆ నాయకత్వంలో మాత్రమే అభివృద్ధి చెందుతుందని మంత్రి హరీశ్ రావు అన్నారు. బీఆర్ఎస్ గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చిందని, ఈసారి అధికారంలోకి వస్తే ఇళ్ల నిర్మాణంపై ప్రధానంగా దృష్టి పెడతామని చెప్పారు. ఆయన శనివారం మహబూబాబాద్‌లో బీఆర్ఎస్ అభ్యర్థి శంకర్ నాయక్ కు మద్దతుగా, జనగామలో మరో అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డికి మద్దతుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంపై కాంగ్రెస్, బీజేపీలు చేస్తున్న ఆరోపణలు ఆయన తోసిపుచ్చారు. తెలంగాణను ఆగం చేసిన సమైక్యవాదులు మళ్లీ దండెత్తి వస్తున్నారని, వారికి మానుకోట దమ్మేంటో చూపాలని ఓటర్లను కోరారు.
‘‘సమైక్యవాదులు దండయాత్రకు వచ్చిన రోజు మానుకోట ప్రజలు తరిమికొట్టారు. ఆ దెబ్బతో సమైక్య వాదులు పారిపోయారు. ఎన్నికలొస్తున్నాయని ఇప్పుడు మళ్లీ తెలంగాణపై దండెత్తడానికి వస్తున్నారు. వాళ్లకు మానుకోట దమ్మేంటో చూపాలి. కేసీఆర్ నాయకత్వంలోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతోంది. గులాబీ జెండా లేకుంటే మానుకోటకు మెడికల్ కాలేజీ, ఇంజినీరింగ్ కాలేజీ, హార్టికల్చర్ కాలేజీ వచ్చేవా? కరోనా సమయంలో ఆయన ప్రజలను కడుపులో పెట్టుకుని చూశారు. రైతులకు రైతుబంధు కింద 73 వేల కోట్లు ఇచ్చాం. ఉచిత కరెంటు ఇస్తున్నాం’’ అని వివరించారు.
ప్రియాంకా గాంధీ హవా తెలంగాణలో పనిచేయదని, ఆమె 403 సీట్లున్న యూపీలో ప్రచారం చేస్తే కేవలం రెండే సీట్లు వచ్చాయని హరీశ్ ఎద్దేవా చేశారు. ‘‘మేం 90 శాతం హామీలను అమలు చేశాం. పోడు భూములకు పట్టాలు ఇచ్చాం. రుణమాఫీ కూడా త్వరలో పూర్తి చేస్తాం. ఈసారి ఇళ్ల నిర్మాణంపై దృష్టి సారిస్తాం. పేదలందరికీ ఇళ్లు కట్టిస్తాం. అసైన్డ్ భూములకు హక్కులు కల్పిస్తాం’’ అని హామీ ఇచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై రేవంత్ రెడ్డి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని, ప్రాజెక్టును ఇసుకలో కట్టకుండా ఆయన నెత్తిమీద కట్టాలా అని ప్రశ్నించారు.