ఏపీ సీఎం జగన్‌తో తన రిలేషన్ బయటపెట్టిన పొంగులేటి
తనకు, ఏపీ సీఎం జగన్‌కు మధ్య గల వ్యక్తిగత సంబంధాలపై మీడియాకు తెలియజేశారు తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం రావడంతో.. విజయవాడలో ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ సన్నిధిలో తన మొక్కు చెల్లించుకునేందుకు వచ్చారు మంత్రి. వెంట వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి రాగా.. ఈ ఉదయం ఇద్దరూ కలిసి దుర్గమ్మను దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. నాకు, సీఎం జగన్ కు మధ్య వ్యక్తిగత సంబంధాలు వేరు, రాజకీయ సంబంధాలు వేరని చెప్పారు. ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో విభజన సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామన్నారు. రెండు రాష్ట్రాల ప్రజలు చల్లగా ఉండాలని కోరుకున్నానని, అన్నదమ్ముల మాదిరిగా తెలుగు రాష్ట్రాల సమస్యను పరిష్కారం చేసుకుంటామని తెలిపారు.
ఇక అధికారంలో వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6గ్యారెంటీ హామీలను అమలు చేస్తుందన్నారు పొంగులేటి. మ్యానిఫెస్టోలో పెట్టిన ప్రతి హామీని అమలు చేస్తామన్నారు. రెండు రాష్ట్రాల మధ్య ప్రతీ సమస్యను సామరస్యంగా పరిష్కరిస్తాము. తెలంగాణ ప్రజలను ఆకాంక్షలను నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ నెరవేర్చలేదని, గడిచిన పదేండ్లలో అభివృద్ధి పేరుతో అప్పులు చేశారని ఆరోపించారు. ధనిక తెలంగాణను పదేళ్లలో పాలనలో 5లక్షల కోట్ల అప్పుల తెలంగాణగా మార్చారని విమర్శించారు.