నేటితో ముగియనున్న అసెంబ్లీ సమావేశాలు.. కేసీఆర్ స్పీచ్‌పై ఉత్కంఠ
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నేటితో ముగియనున్నాయి. శనివారం 5 బిల్లులకు ఆమోదం తెలిపిన ప్రభుత్వం.. నేడు తెలంగాణ ప్రగతిపై చర్చలు జరిపే అవకాశం ఉంది. ముఖ్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ సుదీర్ఘంగా నేడు సభలో ప్రసంగించనున్నారు. ఆదివారం సీఎం కేసీఆర్ చేసే ప్రసంగంపైనే సర్వత్రా ఆసక్తి నెలకొన్నది. అధికార పార్టీ ఎమ్మెల్యేలతో పాటు విపక్షాల సభ్యులూ సీఎం ఏయే అంశాలను లేవనెత్తుతారని గమనిస్తున్నారు. బహుముఖ వ్యూహంతో ప్రసంగించనున్నట్లు అధికార పార్టీ ఎమ్మెల్యేలు వ్యాఖ్యానించారు. విపక్షాలైన కాంగ్రెస్, బీజేపీలను తూర్పారబట్టడంతో పాటు కేంద్ర ప్రభుత్వంపైనా ఘాటుగా విమర్శలు చేసే అవకాశమున్నది. మరోవైపు తొమ్మిదేళ్లలో బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రం సాధించిన ప్రగతిని కేసీఆర్ తన ప్రసంగంలో నొక్కిచెప్పనున్నారు.
దాదాపు మూడున్నర గంటలకు పైగా ముఖ్యమంత్రి స్పీచ్ ఉండొచ్చని అంచనా. ప్రసంగ పాఠాన్ని పక్కా ప్రణాళికతో తయారు చేస్తున్నట్లు పలువురు మంత్రులు పేర్కొన్నారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల రిజల్ట్ తర్వాత తెలంగాణలోనూ కాంగ్రెస్ బలపడిందని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆ పార్టీ గతంలోని పాలనా వైఫల్యాలను ఏకరువు పెట్టి కార్నర్ చేయాలని భావిస్తున్నారు. ఇంకోవైపు బీజేపీకి బీఆర్ఎస్ బీ-టీమ్ అని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో దాన్ని తిప్పికొట్టడానికి పకడ్బందీ ప్రణాళికతో కౌంటర్ ఇచ్చే అవకాశాలున్నాయి. మరోవైపు కేంద్ర ప్రభుత్వ వైఖరిని కూడా కేసీఆర్ ఎండగట్టాలనుకుంటున్నట్లు తెలిసింది. వివక్ష చూపుతూ, నిబంధనల ప్రకారం రావాల్సిన నిధులను ఇవ్వకుండా అడ్డుకోవడం, వెనకబడిన జిల్లాల ఫండ్స్ ను ఎగ్గొట్టడం, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ స్కీమ్‌లకు ఆర్థిక శాఖ ఆమోదం తెలపకుండా రూ. 24 వేల కోట్లకు ఎగనామం పెట్టడం.. ఇలాంటి అంశాలన్నింటినీ ప్రస్తావించే చాన్స్ ఉన్నదని మంత్రులు ఉదహరించారు.
ఎన్నికలకు ముందు ఈ సమావేశాలను చివరి సమావేశాలుగా పరిగణిస్తున్నారు. అందులో భాగంగానే ఇవాళ స్వల్పకాలిక చర్చ అంశాన్ని ఖరారు చేసి అజెండాలో పొందుపరిచారు. రాష్ట్ర ఆవిర్భావం(2014 జూన్ రెండో తేదీ ) మొదలు అధికారంలో ఉన్న కేసీఆర్ సర్కార్.. తమ హయాంలోని అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, రాష్ట్ర పురోగతిని శాసనసభ వేదికగా ప్రజలందరికీ వివరించేలా వ్యూహం సిద్ధం చేసింది. వ్యవసాయ రంగం మొదలు సంక్షేమం, అభివృద్ధి, ఆర్థిక పురోగతి తదితర అంశాలన్నింటినీ వివరిస్తూ రోల్ మోడల్‌గా, నెంబర్ వన్ స్టేట్‌గా ఎదిగిన క్రమాన్ని విస్తారంగా వివరించనున్నట్లు సన్నిహిత వర్గాలు పేర్కొన్నాయి. తలసరి ఆదాయంలో దేశంలోనే మూడో స్టేట్‌గా నిలవడంతో పాటు తలసరి విద్యుత్ వినియోగంలో నెంబర్ వన్ స్థానంలో నిలవడం తదితర అంశాలను కూడా నొక్కిచెప్పే అవకాశమున్నది. ఇవే కాకుండా తమ భవిష్యత్ కార్యాచరణను కేసీఆర్ ఆవిష్కరించనున్నట్లు తెలిసింది. కొన్ని కీలక నిర్ణయాలను కూడా ప్రకటించే అవకాశం ఉందని అంటున్నారు.