(Telangana Cabinet Meeting)ఇవాళ తెలంగాణ రాష్ట్ర కేబినెట్ సమావేశం కానుంది. మధ్యాహ్నం 3.30 గంటలకు రాష్ట్ర సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గం భేటీ కానుంది. కాంగ్రెస్ రెండు గ్యారెంటీలు ఇతర అంశాల పై మంత్రివర్గం సమావేశంలో చర్చించనుంది. ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన..రూ. 500కే సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పథకాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపే ఛాన్స్ ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు సంబంధించిన అంశాలపై చర్చించే అవకాశం ఉంది.
ఫిబ్రవరి 8వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. అదే అయితే గవర్నర్ ప్రసంగంతో ఉభయసభలు ప్రారంభం కానున్నాయి. 9వ తేదీన గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానం జరగనుంది. ఈ నెల 10వ తేదీన రాష్ట్రప్రభుత్వం ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్లే ఛాన్స్ ఉంది. దీనికి సంబంధించి మంత్రి వర్గం అసెంబ్లీ సమావేశాల తేదీలను ఖరారు చేయనుంది. బడ్జెట్ ప్రతిపాదనలు, గవర్నర్ ప్రసంగంపై సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రివర్గం చర్చించనున్నట్లు సమాచారం.
కాంగ్రెస్ హామీల్లో రెండు గ్యారెంటీలను అమలు చేసిన ప్రభుత్వం మరో రెండు గ్యారెంటీలను అమలు చేసేందుకు కసరత్తులు చేస్తోంది. ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు, ఆరోగ్యశ్రీ పథకం ద్వారా రూ.10 లక్షల వరకూ వైద్యసేవల హామీలను అమలుచేస్తోంది. అయితే 200 యూనిట్లు ఉచిత కరెంటు, పేదలకు రూ.500కే గ్యాస్ సిలిండర్ హామీల అమలును త్వరలో ప్రారంభిస్తామని సీఎం రేవంత్‌రెడ్డి సభలో ప్రకటించారు. ఈ రెండు గ్యారెంటీలకు సంబంధించి మంత్రి మండలితో చర్చించనున్నారు.