TSPSC: టీఎస్‌పీఎస్సీకి రూ.40 కోట్లు నిధులు విడుదల
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీఎస్‌పీఎస్సీ) కు ప్రభుత్వం రూ. 40 కోట్ల నిధులు విడుదల చేసింది. టీఎస్‌పీఎస్సీకి నిధులు విడుదల చేస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. బడ్జెట్ కేటాయింపుల్లోంచి రూ. 40 కోట్లు విడుదల చేసినట్లు ఆర్థిక శాఖ ఉత్తర్వుల్లో పేర్కొంది. నిధులు ఇవ్వాలని కొంతకాలంగా ప్రభుత్వాన్ని టీఎస్‌పీఎస్సీ కోరుతోంది. మొత్తానికి టీఎస్‌పీఎస్సీకి ప్రభుత్వం నిధులు విడుదల చేసింది.
ఇదిలా ఉండగా.. గ్రూప్-1 లో మరో 60 పోస్టులు పెంచుతూ రాష్ట్ర ఆర్థిక శాఖ ఫిబ్రవరి 6 న(నిన్న)ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో గతంలో టీఎస్‌పీఎస్సీ ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారం 503 పోస్టులు ఉన్నాయి. తాజాగా మరో 60 పోస్టులు పెంచడంతో మొత్తం ఖాళీల సంఖ్య 563 చేరింది. పెరిగిన ఖాళీలతో గ్రూప్ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న వారికి కాస్త ఊరట లభించనుంది. ఇదిలా ఉండగా మొత్తం పోస్టులకు గాను వీలైనంత త్వరగా నోటిఫికేషన్ జారీ చేయాలని తెలంగాణ ప్రభుత్వం టీఎస్‌పీఎస్సీకి తెలిపింది. ఆర్థిక, హోం, కార్మిక, పంచాయతీరాజ్, రెవెన్యూ శాఖల పరిధిలో ఈ పోస్టులను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) ద్వారా భర్తీ చేసేందుకు అనుమతినిస్తూ ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు మంగళవారం జీఓ నం.16 జారీ చేశారు. నోటిఫికేషన్ జారీ చేసి డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ పద్ధతిలో ఈ పోస్టులు భర్తీ చేయాల్సి ఉంటుందని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.