Komatireddy Venkat Reddy : మంత్రి కోమటిరెడ్డికి అస్వస్థత.. 'యశోద' వద్ద భద్రత పెంపు

Byline :  Veerendra Prasad
Update: 2023-12-13 03:00 GMT

తెలంగాణ రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అస్వస్థతకు గురయ్యారు. ఎన్నికల సమయంలోనే ఆయనకు గొంతు నొప్పి ప్రారంభం కాగా తాజాగా మరింత ఎక్కువయ్యింది. దీంతో ఆయన సోమాజిగూడ యశోదా హాస్పిటల్లో చేరారు. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఢిల్లీకి వెళ్లారు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుపొందడంతో ఎంపీ పదవికి రాజీనామా చేసారు. లోక్ సభ స్పీకర్ ను కలిసి తన రాజీనామా లేఖను అందించారు. అలాగే తెలంగాణలోని జాతీయ రహదారుల విస్తరణ చేపట్టాలని నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా చైర్మన్ ను కోరారు. ఇలా గత సోమవారం డిల్లీకి వెళ్లిన కోమటిరెడ్డి తాజాగా హైదరాబాద్ కు చేరుకున్నారు.

అయితే ఎన్నికల సమయంలో విరామంలేకుండా ప్రచారంలో పాల్గొనడం... ఎక్కువగా ప్రసంగించాల్సి రావడంతో కోమటిరెడ్డి త్రోట్ ఇన్పెక్షన్ కు గురయ్యారు. ఇక ప్రస్తుత వాతావరణ పరిస్థితుల కారణంగా ఇది మరింత ఎక్కువయ్యింది. దీంతో ఢిల్లీ నుండి హైదరాబాద్ కు చేరుకున్న వెంటనే చికిత్స కోసం యశోదా హాస్పిటల్లో చేరారు. మంత్రిని పరిక్షించిన డాక్టర్లు.. చికిత్సను అందిస్తున్నారు. రెండ్రోజులపాటు విశ్రాంతి అవసరమని, ఆసుపత్రిలోనే ఉండాలని చెప్పారు. ఇక ఇదే సోమాజిగూడ యశోదా హాస్పిటల్లో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా చికిత్స పొందుతున్నారు. ప్రమాదవశాత్తు ఫామ్ హౌస్ బాత్రూంలో జారిపడ్డ కేసీఆర్ తీవ్రంగా గాయపడ్డారు. తుంటి ఎముక విరగడంతో ఆయనకు యశోదా హాస్పిటల్ వైద్యులు ఆపరేషన్ జరిగింది. దీంతో కొద్దిరోజులుగా ఆయన హస్పిటల్లోనే వుంటున్నారు. ఇప్పుడు మంత్రి కోమటిరెడ్డి కూడా హాస్పిటల్లో చేరడంతో పోలీస్ సెక్యూరిటీని మరింత పెంచారు. 




Tags:    

Similar News