తెలంగాణలో స్కూల్ టైమింగ్స్‎లో మార్పులు!..విద్యాశాఖ కసరత్తు

Update: 2023-06-24 05:00 GMT

తెలంగాణ రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ స్కూల్ టైమింగ్స్‎లో మార్పులు చేసే ఆలోచన చేస్తోంది. ప్రస్తుతం ప్రైమరీ స్కూల్ టైమింగ్స్ ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఉండగా , హై స్కూల్స్ 9.30 గంటల నుంచి సాయంత్రం 4.45 గంటల వరకు పనిచేస్తున్నాయి. మిగతా ప్రాంతాలతో పోల్చితే హైదరాబాద్‌లో స్కూల్స్ కొంత ముందుగా ప్రారంభమవుతాయి. ప్రైమరీ స్కూల్స్‎లో చదివేది చిన్నారులు, ఉదయం త్వరగా నిద్ర లేవరు, అందువల్ల వారికి ఉదయం 9.30 గంటలకు క్లాసులు ప్రారంభం కావాలి, ఇక హై స్కూల్స్‎లో ఉండేది పెద్ద పిల్లలు కావడంతో వారికి ఉదయం 9 గంటలకు క్లాసులు స్టార్ట్ కావాల్సి ఉంది. కానీ , ప్రస్తుతం అందుకు విరుద్ధంగా స్కూల్ టైమింగ్స్ ఉన్నాయని కొంత మంది ప్రజాప్రతినిధులు విద్యాశాఖ దృష్టికి తీసుకువచ్చారు. పాఠశాల సమయాలను మార్చాలని సూచనలు చేశారు. తరగతులను ఉదయం 9.30 లేదా 9.45 గంటలకు స్టార్ట్ చేయాలని సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో

ఎస్‌సీఈఆర్‌టీ అధికారులు స్కూల్ టైమింగ్స్ మార్పులపై కసరత్తు చేస్తున్నట్లు సమాచారం.

ఇదిలా ఉంటే సమయాల్లో మార్పులు చేయాలంటే ముందుగా ప్రభుత్వ ఆమోదం తప్పనిసరి. అందుకే నిపుణులతో డిస్కస్ చేసి, అన్ని కోణాల్లో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని లేదంటే పిల్లలు ఇబ్బంది పడతారని మరికొందరు సూచిస్తున్నారు. ప్రైవేటు పాఠశాలలు ఉదయం 8 గంటలకే పిల్లలను వాహనాల్లో ఎక్కించుకుని వెళ్తున్నాయి, వారి తరగతులు త్వరగా ప్రారంభమవుతాయి. ఈ క్రమంలో ఆలస్యంగా ప్రభుత్వ పాఠశాలలను ప్రారంభిస్తే విద్యార్థుల సంఖ్య మరింత తగ్గుతుందని మరికొంతమంది తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇంకొంతమంది హై స్కూల్స్ కు వచ్చే విద్యార్థులు దూర ప్రాంతాల నుంచి వస్తారు కాబట్టి వారిని దృష్టిలో ఉంచుకుని సమయాల్లో మార్పులు తీసుకురావాలని చెబుతున్నారు. ప్రస్తుతం ప్రభుత్వం ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది. 




Tags:    

Similar News