రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రారంభించిన 'సీఎం బ్రేక్ ఫాస్ట్' పథకాన్ని నేటినుంచి ప్రతి మండలంలోని ఒక ప్రభుత్వ పాఠశాలలో అమలు చేయనున్నారు. వచ్చే సోమవారం నుంచి మరికొన్ని స్కూళ్లకు విస్తరించనున్నారు. ఆపై వచ్చే 3 సోమవారాలు పూర్తయ్యేనాటికి రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో ఈ పథకాన్ని అమలు చేయనున్నారు. ఇటీవల పైలట్ ప్రాజెక్టుగా మంత్రులు రాష్ట్రంలో కొన్ని పాఠశాలల్లో 'సీఎం బ్రేక్ ఫాస్ట్' పథకాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. దసరా తరువాత అన్ని పాఠశాల్లో విద్యార్థులకు అల్పాహారాన్ని అందిస్తామని ప్రకటించారు. అయితే అంచెలంచెలుగా ఈ పథకాన్ని అన్ని పాఠశాలలకు విస్తరించనున్నారు.
నియోజకవర్గానికి ఒకటి చొప్పున ఈ పథకాన్ని ప్రారంభించిన బడుల్లో విద్యార్థుల హాజరుశాతం పెరిగింది. డుమ్మాలు, డ్రాపౌట్లు గణనీయంగా తగ్గాయి. స్కీం అమలైన గత 20 రోజుల వ్యవధిలోనే బడులకు విద్యార్థుల హాజరు భారీగా పెరగడం విశేషం. గురువారం నుంచి మండలానికొక బడి చొప్పున ఈ పథకాన్ని విస్తరించనున్నారు. వచ్చే సోమవారం నుంచి స్కూళ్ల సంఖ్యను పెంచుతూ.. మరో మూడు వారాల్లో రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో సీఎం బ్రేక్‌ఫాస్ట్‌ను అందించనున్నారు.
ఈ పథకాన్ని అక్టోబర్ 6 న వెస్ట్ మారేడుపల్లిలోని ప్రభుత్వ పాఠశాలలో మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. మధ్యాహ్నం భోజనంలో భాగంగా ప్రతి విద్యార్థికి సన్నబియ్యంతో కూడిన భోజనంతో పాటు ఉదయం పూట కూడా నాణ్యమైన బ్రేక్ ఫాస్ట్ పెడితే బాగుంటుందని ఈ పథకాన్ని ప్రారంభిమన్నారు కేటీఆర్. ఈ పథకం విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకు రానున్నదని, స్కూల్ డ్రాపౌట్స్ తగ్గుతాయని చెప్పారు. పనులకు వెళ్లే తల్లిదండ్రుల పిల్లలకు ఈ పథకం ఎంతో ఉపయోగపడుతుందని.. పోషకాలతో కూడి అల్పాహారం విద్యార్థులకు అందుతుందని ఆనాడు కేటీఆర్ అన్నారు.