B. Parthasarathy Reddy:హెటిరో అధినేత, బీఆర్ఎస్‌ ఎంపీకి రేవంత్ సర్కార్ షాక్‌..

Byline :  Veerendra Prasad
Update: 2024-01-30 13:19 GMT

తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. హెటిరో అధినేత, బీఆర్ఎస్‌ రాజ్యసభ ఎంపీ పార్థసారధి రెడ్డికి గత ప్రభుత్వం కేటాయించిన భూములపై జీవోను నిలుపుదల చేయాలని నిర్ణయించింది. పార్ధసారధి రెడ్డికి గత ప్రభుత్వం భూములు కేటాయిస్తూ ఉతర్వులు జారీ చేసింది. హైదరాబాద్‌ మహా నగరంలోని శేరిలింగంపల్లి మండలంలో పార్థసారధి రెడ్డి ట్రస్టీగా ఉన్న సాయిసింధు ఫౌండేషన్‌కు సుమారు రూ.500 కోట్ల విలువైన 15 ఎకరాల భూమిని గత ప్రభుత్వం 30 ఏళ్ల లీజుకు కట్టబెట్టింది. ఇప్పుడు ఆ జీవోను కాంగ్రెస్ ప్రభుత్వం నిలుపుదల చేసింది. జీవో 140ని నిలిపివేస్తూ నిర్ణయం తీసుకుంది. సింధు ఫౌండేషన్, క్యాన్సర్ మందు పరిశోధన కోసం గత కేసీఆర్ ప్రభుత్వం ఈ భూములను కేటాయించింది. విలువైన భూములను అప్పనంగా పంచిపెట్టారని, కొందరికి తమ పార్టీకి అనుకూలంగా వ్యవహరించిన వారికి తక్కువ మొత్తానికి లీజుకు ఇచ్చారంటూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం గత జీవోను నిలిపేయాలని నిర్ణయించడం సంచలనంగా మారింది.

హైటెక్‌సిటీకి కూతవేటు దూరంలో ఉన్న ఆ 15 ఎకరాల భూమిని కేసీఆర్ సర్కారు.. క్యాన్సర్‌ జనరల్‌ ఆస్పత్రిని నిర్మించాలనుకున్నట్లు చెప్పిన తమ ఎంపీకి కారు చౌకగా కట్టబెట్టింది. రూ.4 వేల కోట్ల విలువైన భూమిని.. ఏడాదికి ఎకరానికి రూ.2 లక్షల చొప్పున.. మొత్తం రూ.30 లక్షలు చెల్లించేలా లీజుకు ఇచ్చింది. ఈ వ్యవహారంలో గత సర్కారు జీవోను హైకోర్టు కొట్టివేసినా.. లీజు నిబంధనలకు సంబంధించిన జీవోలకు సవరణలు చేసి, కొత్త జీవో ద్వారా మళ్లీ పార్థసారథిరెడ్డి ట్రస్టీగా ఉన్న సంస్థకు భూములను కట్టబెట్టింది. శేరిలింగంపల్లి మండల పరిధిలోని ఇజ్జత్‌నగర్‌(హైటెక్స్‌ వెళ్లే మార్గం)లో 15.48 ఎకరాల ప్రభుత్వ భూమిని కేటాయించింది. అయితే గత ప్రభుత్వ హయాంలో ధారాదత్తం చేసిన భూములపై రేవంత్‌ సర్కారు దృష్టి సారించింది. శాటిలైట్‌ చిత్రాల ఆధారంగా అ భూములు అ‘క్రమబద్ధీకరణలు’ అని తేలడంతో.. వెయ్యి దాకా రిజిస్టర్డ్‌ డాక్యుమెంట్లను నిలిపివేసింది.

Tags:    

Similar News