Pending Challans: రేప‌టితో ముగియ‌నున్న పెండింగ్ చ‌లాన్ల గ‌డువు

Byline :  Veerendra Prasad
Update: 2024-01-30 16:25 GMT

రాష్ట్రంలోని వాహనదారులకు అలర్ట్‌.. పెండింగ్‌లో ఉన్న చలాన్లపై ట్రాఫిక్ పోలీస్ శాఖ ప్రకటించిన డిస్కౌంట్ గడువు రేపటితో ముగియనుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని చలాన్లు పెండింగ్‌లో ఉన్నవారు వెంటనే చెల్లించి డిస్కౌంట్ ఆఫర్‌ను సద్వినియోగం చేసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు. పెండింగ్ చలాన్లపై ప్రకటించిన డిస్కౌంట్ గడువును ఇప్పటికే పోలీసులు ఓసారి పెంచిన విషయం తెలిసిందే. గతేడాది డిసెంబర్ 27 నుంచి ఈ డిస్కౌంట్ ఆఫర్‌ను అమల్లోకి తీసుకురాగా.. 15 రోజుల పాటు అవకాశం కల్పించారు. కాగా.. ఇంకా కట్టాల్సిన చలాన్లు చాలా ఉండటంతో.. ఆ డిస్కౌంట్ ఆఫర్ గడువును జనవరి 31 వరకు పొడిగించింది. అయితే చాలా చలాన్లు పెండింగ్‌లో ఉండడంతో మళ్లీ పెంచే అవకాశం ఉందనే ఊహాగానాలు వినిపించగా.. పోలీసులు వీటిపై క్లారిటీ ఇచ్చారు. మ‌రోసారి గ‌డువు పొడిగించేది లేద‌ని ఇప్పటికే స్పష్టం చేశారు

ఇక.. పెండింగ్ లో ఉన్న చలాన్లపై డిస్కౌంట్ ఆఫర్ ద్వారా ప్రభుత్వానికి భారీగా ఆదాయం వచ్చినట్లు తెలుస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా 3.59 కోట్ల చలాన్లు పెండింగ్‌లో ఉండగా, ఇప్పటివరకు 1,52,47,864 మంది చలాన్లు చెల్లించారు. అయితే ఇది మొత్తం 42.38 శాతం మాత్రమే కావడం గమనార్హం. కాగా, ఇప్పటివరకు చెల్లించిన చలాన్ల ద్వారా రూ.135 కోట్ల ఆదాయం సమకూరినట్లు పోలీసులు తెలిపారు. హైదరాబాద్ కమిషనరేట్‌లో 34 కోట్లు, సైబరాబాద్‌లో 25 కోట్లు, రాచకొండలో 16 కోట్లు ఆదాయం వచ్చింది. ద్విచక్రవాహనాలు, ఆటోలకు 80%, ఆర్టీసీ బస్సులకు 90%, ఇతర వాహనాలకు 60% రాయితీ ప్రకటించటంతో మంచి స్పందన వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు భారీగా ఆదాయం సమకూరింది.

Tags:    

Similar News