ఎమ్మెల్యే లాస్య మృతిపై దర్యాప్తు వేగవంతం..

By :  Vinitha
Update: 2024-02-25 01:57 GMT

హైదరాబాద్ ఓఆర్ఆర్ రోడ్డు ప్రమాదంలో సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతి చెందిన ఘటన తెలిసిందే. ఈ రోడ్డు ప్రమాదానికి సంబంధించి కేసు దర్యాప్తును పోలీసులు వేగవంతం చేశారు. ప్రమాదం ఎలా జరిగింది అన్న కోణంలో దర్యాప్తు కోనసాగిస్తున్నారు. అవుటర్‌పై వెళ్తున్న కారు.. ముందు వెళ్తున్న వాహనాన్ని ఢీకొట్టడంతో అదుపు తప్పి రెయిలింగ్‌ను తగిలి ఆగిపోయి ఉంటుందని భావిస్తున్నారు. దాదాపు 500 మీటర్ల దూరం నుంచి వాహన భాగాలు పడి ఉండటం, కారుపై రాక్‌శాండ్‌ పౌడర్‌ కనిపించడంతో టిప్పర్‌ లేదా రెడీమిక్స్‌ వాహనాన్ని ఢీకొట్టి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. పీఏ ఆకాశ్ మద్యం తాగి డ్రైవ్ చేశాడా, లేదా అని తెలుసుకోడానికి అతని రక్త నమూనాలను పరీక్ష కోసం పంపారు. అతని ఫోన్ డేటా కూడా పరిశీలిస్తున్నారు.

అయితే లాస్యనందితతో పాటు అదే కారులో ప్రయాణిస్తున్న ఆమె అక్క కుమార్తె శ్లోక కొన్ని నిమిషాల ముందే మరో కారులోకి మారడంతో ప్రమాదం నుంచి తప్పించుకున్నట్లు తెలుస్తోంది. కొంతకాలంగా లాస్య అనారోగ్య సమస్యలు, రెండు ప్రమాదాల నుంచి బయటపడటంతో...కుటుంబ సభ్యులతో కలిసి 22న రాత్రి సమయంలో ఆరూర్‌లోని దర్గాకు వెళ్లి తెల్లవారుజామున తిరుగు ప్రయాణమయ్యారు. ఒక కారులో నందిత, ఆకాశ్‌తోపాటు చిన్నారి శ్లోక, మరో కారులో ఇతర కుటుంబసభ్యులు ఉన్నారు. యాక్సిడెంట్ కు ముందు లాస్య శ్లోకను మరో కారులో ఎక్కించారు. బాలికకు స్కూల్ ఉన్నందున ముందుగా ఇంటికి వెళ్లాలని, తాను టిఫిన్ చేసి వస్తానని చెప్పి కుటుంబసభ్యులను పంపారు. తరువాత కాసేపటికే పటాన్‌చెరు సమీపంలో యాక్సిడెంట్ అయ్యి ఎమ్మెల్యే మృతిచెందారు.

Tags:    

Similar News