BRS leader Shakeel: మాజీ ఎమ్మెల్యే షకీల్‌కు బిగ్ షాక్.. ఎఫ్ఐఆర్ నమోదు
బీఆర్ఎస్ నేత, బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్‌కు పోలీసులు బిగ్ షాక్ ఇచ్చారు. ప్రజా భవన్ ఎదుట షకీల్ కుమారుడు సాహిల్ ర్యాష్ డ్రైవింగ్ కేసులో... షకీల్ పేరును సైతం ఎఫ్ఐఆర్‌లో పోలీసులు చేర్చారు. సాహిల్ దుబాయ్ పారిపోయేందుకు 10 మంది సాయం చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఇద్దరిని పంజాగుట్ట పోలీసులు అరెస్ట్ చేశారు. అర్బాజ్, సోహెల్‌ను రిమాండ్‌కు తరలించారు. మరో ముగ్గురు పరారీలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఇప్పటికే సాహీల్‌పై లుక్ అవుట్ సర్క్యులర్(ఎల్‌వోసీ)ని అధికారులు జారీ చేశారు. దుబాయ్‌లో ఉన్న రహీల్‌ను రప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ తనయుడు సాహిల్... హైదరాబాద్ బేగంపేట వద్ద ప్రజాభవన్ బారికేడ్ ను ఢీకొట్టాడనే ఆరోపణలు వచ్చాయి. అయితే ఆ సమయంలో కారు నడిపింది తానేనని డ్రైవర్ ఆసిఫ్ పోలీసులకు లొంగిపోయాడు. ఆసిఫ్ బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ ఇంట్లో పనిచేసే డ్రైవర్ గా చెబుతున్నారు. అయితే ఈ విషయమై పంజాగుట్ట పోలీసులపై ఆరోపణలు వచ్చాయి. దీంతో సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి విచారణకు ఆదేశాలు జారీ చేశారు. ఈ విచారణలో పోలీసులు కీలక సమాచారం సేకరించారని తెలిసింది. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లోని సీసీపుటేజీని పరిశీలిస్తే కీలక విషయాలు వెలుగు చూశాయి. ప్రజా భవన్ వద్ద బారికేడ్‌ను ఢీకొట్టిన సమయంలో వాహనాన్ని నడిపింది సాహిల్‌గా తేలడంతో పంజాగుట్ట సీఐ దుర్గారావును సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి సస్పెండ్ చేశారు. ఈ కేసులో డ్రైవింగ్ చేసిన వ్యక్తిని మార్చినందుకు కేసు నమోదు చేశారు. సాహిల్ మాత్రం పోలీసులకు చిక్కలేదు. ప్రస్తుతం దుబాయ్‌లో ఉన్నసాహిల్‌ను ఇండియాకు రప్పించనున్నారు.