కుట్రకోణం.. మేడిగడ్డ ఘటనపై కేసు నమోదు

Byline :  Veerendra Prasad
Update: 2023-10-24 09:16 GMT

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ(లక్ష్మీబ్యారేజీ ) బ్యారేజీ పిల్లర్లు కుంగిన ఘటన.. ఎన్నికల వేళ రాజకీయ దుమారం రేపుతోంది. ఈ క్రమంలో లక్ష్మీబ్యారేజీ కుంగిపోయిన ఘటనపై ఇరిగేషన్ అధికారుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఇరిగేషన్ శాఖ ఏఈఈ రవికాంత్ ఫిర్యాదు మేరకు మహాదేవ్ పూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. మేడిగడ్డ ఘటన వెనుక సంఘ విద్రోహ శక్తులున్నాయని, ఈ ఘటనకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని ఫిర్యాదులో పేర్కొన్నారు ఏఈఈ రవికాంత్. ఈ నెల 21న సాయంత్రం పెద్ద శబ్దంతో పిల్లర్లు కుంగిపోయిందని.. 19,20, 21 పిల్లర్లు కుంగిపోయినట్టుగా ఆ ఫిర్యాదులో చెప్పారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు లక్ష్మీ బ్యారేజీ పిల్లర్లు కుంగిపోవడం వెనుక విద్రోహశక్తుల ప్రమేయం ఉందనే అనుమానాన్ని ఆయన వ్యక్తం చేశారు.




 


ఈ ఫిర్యాదుపై భూపాలపల్లి జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే స్పందించారు. ఈ ఘటన వెనుక మావోయిస్టుల ప్రమేయం లేదని ఆయన తేల్చి చెప్పారు. ఈ ఘటన వెనుక ఎవరున్నారనే విషయమై ఆరా తీస్తున్నట్టుగా పోలీసులు ప్రకటించారు. పీడీపీపీ సెక్షన్ కు చెందిన మూడు సెక్షన్లతో ఐపీసీ 427 కింద కేసు నమోదు చేశారు పోలీసులు.

ఇదిలా ఉండగా లక్ష్మీ బ్యారేజీని మంగళవారంనాడు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ టీమ్ పరిశీలించింది. అనిల్ జైన్ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల బృందం పరిశీలించింది. ఈ నెల 21న మేడిగడ్డ వద్ద నిర్మించిన లక్ష్మీ బ్యారేజీ కుంగిపోయింది. బ్యారేజీకి చెందిన 20, 21 పిల్లర్లను నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ బృందం పరిశీలించింది. 20వ నెంబర్ పిల్లర్ ఐదు అడుగుల మేర కుంగిపోయింది. 15 నుండి 20వ పిల్లర్లను నిపుణుల బృందం పరిశీలించింది. ప్రధానంగా 19, 20 పిల్లర్ల మధ్య కుంగుబాటుకు గురైందని నిపుణులు భావిస్తున్నారు. నీటి పారుదల శాఖ అధికారులు, ప్రాజెక్టు నిర్మాణంలో పాల్గొన్న ఇంజనీరింగ్ సిబ్బందితో నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ బృందం చర్చిస్తున్నారు.



 


Tags:    

Similar News