బీఆర్ఎస్ స్వేదపత్రం రేపటికి వాయిదా పడింది. ఆదివారం ఉదయం 11 గంటలకు తెలంగాణ భవన్‌లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బీఆర్ఎస్ స్వేదపత్రంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో గత పదేళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వానికి సంబంధించి శ్వేతపత్రాన్ని విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీనికి కౌంటర్ గా తమ తొమ్మిదిన్నరేళ్ల పాలనపై స్వేద పత్రాన్ని విడుదల చేస్తామని సిరిసిల్ల ఎమ్మెల్యే, మాజీ మంత్రి కేటీఆర్ నిన్న ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. తెలంగాణ ప్రతిష్టను దెబ్బతీస్తే సహించమని.. ఇన్నాళ్లు తెలంగాణలో అప్పులు కాదు ఆస్తులు సృష్టించామని అన్ని వివరాలు స్వేదపత్రం ద్వారా ప్రజల ముందు ఉంచుతామని ప్రకటించారు. ఈ స్వేద పత్రాన్ని శనివారం ఉదయం 11 గంటలకు విడుదల చేస్తామని ముందు ప్రకటించారు. కానీ ఈ విడుదలను రేపటికి వాయిదా వేశారు.
ఇక ఇవాళ మధ్యాహ్నం ఒంటి గంటకు కేటీఆర్ మీడియాతో చిట్‌చాట్ చేయనున్నారు. శనివారం ఉదయం 11 గంటలకు బీఆర్ఎస్ స్వేదపత్రాన్ని విడుదల చేస్తామని, అనంతరం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తామని నిన్న కేటీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. స్వేద పత్రం కోసం టీఆర్ఎస్ శ్రేణులు, రాష్ట్ర ప్రజలు ఆసక్తిగా ఎదురుచూశారు.