సీపీఐ, సీపీఎంలతో బీఆర్ఎస్ ఎందుకు పొత్తు పెట్టుకోలేదంటే..?
తెలంగాణలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. బీఆర్ఎస్ ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించగా.. మిగితా పార్టీలు అభ్యర్థుల వేటలో పడ్డాయి. బీఆర్ఎస్ టికెట్లు దక్కని వారంతా కాంగ్రెస్, బీజేపీ పార్టీల వైపు చూస్తున్నారు. అయితే బీఆర్ఎస్ అభ్యర్థుల ప్రకటనతో వామపక్షాల ఆశలు ఆవిరైనట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్తో పొత్తు ఉంటుందని గంపెడాశలు పెట్టుకున్న ఆ పార్టీ శ్రేణులకు కేసీఆర్ ప్రకటన షాక్ ఇచ్చింది. అయితే వ్యూహంలో భాగంగానే కేసీఆర్ ఆ పార్టీలను పక్కనబెట్టారా అనే చర్చ నడుస్తోంది.
తెలంగాణలో ఉనికి కోల్పోయిన వామపక్షాలకు మునుగోడు బీఆర్ఎస్ విజయం కొత్త ఆశలను ఇచ్చింది. మునుగోడులో ఎర్ర జెండా పార్టీలకు పట్టు ఉండడంతో ఆ ఉపఎన్నికలో సీపీఐ, సీపీఎం పార్టీలతో బీఆర్ఎస్ పొత్తు పెట్టుకుంది. ఆ ఉపఎన్నికలో బీఆర్ఎస్ విజయం ఎర్ర పార్టీలకు సైతం కొత్త ఊపిరి వచ్చినట్లైంది. ఇదే జోష్లో అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకుని సత్తా చాటాలని ఉవ్విళ్లూరాయి. కానీ గులాబీ బాస్ వాటికి ఝలక్ ఇస్తూ 115 స్థానాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించడంతో వామపక్షాల ఆశలు ఆవిరయ్యాయి.
పెద్ద వ్యూహమే..
కేసీఆర్ నిర్ణయం వెనక పెద్ద వ్యూహమే ఉన్నట్లు తెలుస్తోంది. సీపీఐ, సీపీఎం పార్టీలు ఎన్నికల బరిలో ఉంటే తమకు కలిసొస్తుందనేది గులాబీ బాస్ ఆలోచనగా తెలుస్తోంది. వామపక్షాలు బరిలో ఉంటే ఓట్ల చీలిపోయి బీఆర్ఎస్కు మేలు జరుగుతుందనేది కేసీఆర్ ప్లాన్గా తెలుస్తోంది. ఈ ప్రణాళికతో కాంగ్రెస్, బీజేపీలకు షాక్ ఇవ్వొచ్చన్నది వారి అభిప్రాయం. అందుకే ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్.. ఎర్రజెండా పార్టీలతో పొత్తు పెట్టుకోలేదని సమాచారం.
డైలామాలో వామపక్షాలు..
కేసీఆర్ నిర్ణయంతో సీపీఐ, సీపీఎం పార్టీలు డైలామాలో పడ్డాయి. ఏం చేయాలనే దానిపై మల్లగుల్లాలు పడుతున్నాయి. ఒంటరిగా ఎన్నికల బరిలోకి దిగడమా లేక మరో పార్టీతో కలిసి ముందుకెళ్లడమా అనే దానిపై చర్చోపచర్చలు సాగిస్తున్నాయి. బీఆర్ఎస్ లేకపోవడంతో ఎర్ర జెండా పార్టీలకు కాంగ్రెస్ ఆప్షన్గా మారింది. ఒకవేళ అవి కాంగ్రెస్తో జతకడితే బీఆర్ఎస్కు నష్టం జరిగే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఒంటరిగా బరిలోకి దిగితే మాత్రం అది బీఆర్ఎస్కు మేలు చేస్తుందని విశ్లేషకుల మాట. ఇక బీజేపీ పార్టీతో సీపీఐ, సీపీఎం పార్టీల పొత్తుకు అవకాశమే లేదు.
బలం లేని చోట ఎలా..
ఈ క్రమంలో వామపక్ష పార్టీల నెక్స్ట్ స్టెప్ ఏంటన్నది ఆసక్తిగా మారింది. కేసీఆర్ తమను అవసరానికి వాడుకుని వదిలేశారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఆరోపించారు. బీఆర్ఎస్ నిర్ణయంతో ఏం చేయాలనే దానిపై చర్చిస్తున్నట్టుగా ఆయన చెప్పారు. లెఫ్ట్ పార్టీలకు బలం లేని చోట ఏ విధంగా ముందుకెళ్లాలన్న అంశంపై ఆలోచిస్తామన్నారు. తమకు బలం లేని స్థానాల్లో ప్రజాతంత్ర శక్తులను గెలిపించాలని కోరుతామన్న ఆయన.. అయితే ప్రజాంతత్ర శక్తులు ఎవరనే విషయమై చర్చిస్తున్నామన్నారు. ఏదిఏమైనా కేసీఆర్ ప్రకటన వామపక్షాల్లో కాక రేపుతున్నాయి. ఆ పార్టీలు ఏ విధమైన నిర్ణయం తీసుకుంటారన్నది వెయిట్ అండ్ సీ..