తెలంగాణలో రెండురోజుల పాటు వానలు దంచికొట్టనున్నాయి. జులైలో గట్టిగా కొట్టిన వానలు.. అగస్ట్లో అడ్రస్ లేకుండా పోయాయి. గత నెలలో పడిన వర్షాలకు ప్రాజెక్టులు సహా వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. పలు చోట్ల గ్రామాలే నీటమునిగి.. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ నెలలో వర్షాలు సరిగ్గా లేకపోవడంతో అటు అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో వాతావరణ శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది.
ఇవాళ, రేపు తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో పలు చోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు పడుతాయని తెలిపింది. అదిలాబాద్, నిర్మల్, ఆసీఫాబాద్ జిల్లాల్లో అతిభారీ వర్షాలు పడుతాయని తెలంగాణ వెదర్ మ్యాన్ చెప్పారు. ఉమ్మడి నిజామాబాద్, ఉమ్మడి కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయన్నారు.
హైదరాబాద్ సహా మిగితాచోట్ల మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు. దీంతో పలు జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. జులైలో 23శాతం అధిక వర్షపాతం నమోదు కాగా.. ఆగస్టులో మాత్రం 82శాతం వర్షపాతం లోటు ఉన్నట్లు వాతావరణశాఖ చెబుతోంది. కాగా ఇప్పటికే పలుచోట్ల వర్షం పడుతోంది. అటు వాతావరణ శాఖ హెచ్చరిక నేపథ్యంలో అధికారులు కూడా అప్రమత్తమయ్యారు.