ఈ ఆదివారం హైదరాబాద్ మహానగరం కీలక సభలకు వేదిక కానుంది. ప్రధాన పార్టీలైన బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలు నేడు హైదరాబాద్ కేంద్రంగా వివిధ కార్యక్రమాలతో.. ప్రజలకు దగ్గరయ్యేందుకు పోటీపడుతున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ.. నగరంలోని తాజ్ కృష్ణ హోటల్‌లో నిన్న, నేడు రెండు రోజుల పాటు సిడబ్ల్యూసీ సమావేశాలు జరుపుతోంది. నేడు ఈ సమావేశాల్లో విస్తృతస్థాయి భేటీ జరగనుంది. ఇవాళ్టి కాంగ్రెస్ సిడబ్ల్యూసీ సమావేశంలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నారు. సాయంత్రం తుక్కుగూడలో విజయభేరి సభను భారీ ఎత్తున నిర్వహిస్తుంది కాంగ్రెస్ పార్టీ. సాయంత్రం 6 గంటలకు బహిరంగ సభలో సోనియాగాంధీ 5 ఎన్నికల హామీలను ప్రకటించనున్నారు. ఈ సభకు సోనియాగాంధీతో పాటు ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే, అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో పాటు ఇతర రాష్ట్రాల సీఎంలు, సీఎల్పీ నేతలు హాజరవుతున్నారు. ఈ సభకు సుమారు 10 లక్షల మందిని సేకరిస్తున్నారు కాంగ్రెస్ నేతలు. ఇప్పటికే తుక్కుగూడ ఔటర్ రింగ్ రోడ్డు నుంచి సభా ప్రాంగణం వరకు భారీ కటౌట్లు, బ్యానర్లు ఏర్పాటు చేశారు.
ఇక సెప్టెంబరు 17ను రాష్ట్ర ప్రభుత్వం సమైక్యతా దినోత్సవంగా నిర్వహిస్తుండగా.... కేంద్రం విమోచన దినంగా జరుపనుంది. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించబోయే జాతీయ సమైక్యతా దినోత్సవం కార్యక్రమంలో భాగంగా సీఎం .. పబ్లిక్ గార్డెన్స్‌లో జాతీయ జెండాను ఎగరేస్తారు. ఇదే విధంగా బీఆర్ఎస్‌తో పొత్తు పెట్టుకున్న MIM పార్టీ కూడా జాతీయ జెండాను ఎగరేస్తోంది. హైదరాబాద్‌తోపాటూ... జిల్లా కేంద్రాల్లో కూడా బీఆర్ఎస్ జాతీయ సమైక్యతా దినోత్సవాల్ని జరపబోతోంది. అక్కడ కూడా అసెంబ్లీ స్పీకర్, మండలి ఛైర్మన్, డిప్యూటీ ఛైర్మన్, మంత్రులు, ప్రభుత్వ చీఫ్ విప్‌లు, విప్‌లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలూ జెండాలు ఎగరేస్తారు.
మరోవైపు చరిత్రలో జరిగింది ఒకటైతే.. ఆ చరిత్రను బీఆర్ఎస్ వక్రీకరిస్తోందంటూ.. బీజేపీ పరేడ్ గ్రౌండ్ వేదికగా నేడు విమోచన దినోత్సవ వేడుకలకు సిద్ధమైంది. కేంద్ర ప్రభుత్వం నిర్వహించే ఈ వేడుకల్లో కేంద్ర మంత్రి అమిత్ షా పాల్గొంటున్నారు. ఇప్పటికే సభ ఏర్పాట్లను ఘనంగా చేశారు బీజేపీ నేతలు. మూడు రాష్ట్రాలకు చెందిన సీఎం(తెలంగాణ సీఎం కేసీఆర్, మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ సిండే, కర్ణాటక సీఎం సిద్దరామయ్య)లను ఆహ్వానించారు. హైదరాబాద్ పరేడ్‌గ్రౌండ్‌లో.. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించే విమోచన దినోత్సవంలో అమిత్ షాతో పాటు దేశ వ్యాప్తంగా ఉన్న పలువురు కీలక నేతలు సైతం పాల్గొంటారు. 9.15 నిమిషాలకు పరేడ్ గౌండ్ లో జాతీయ జెండాను ఎగురవేసి.. విమోచన దినోత్సవాన్ని పురష్కరించుకొని ప్రసంగిస్తారు. మధ్యాహ్నం తిరిగి ఆయన ఢిల్లీకి వెళ్లనున్నారు. మొత్తానికి సెప్టెంబర్ 17 లక్ష్యంగా సాగుతున్న ఈ పొలిటికల్ ఫైట్‌లో ఎవరు పైచేయి సాధిస్తారో వేచి చూడాల్సిందే..