Bandi Sanjay : నేటి నుంచి బండి సంజయ్ ప్రజాహిత పాదయాత్ర..అక్కడి నుంచే స్టార్ట్
పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండి సంజయ్ ప్రజా హిత యాత్రకు శ్రీకారం చుట్టారు. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పాదయాత్ర చేయనున్నారు. ఇవాళ ఉదయం కొండుగట్ట అంజన్న సన్నిధిలో పూజలు చేసి మేడిపల్లి నుంచి యాత్రను ప్రారంభిస్తారు. తొలి విడత యాత్ర ఈ నెల 15 వరుకు కొనసాగనుంది. ప్రజాహితమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వఅభివృద్ధి పథకాలను ప్రజలోకి తీసుకెళ్లడమే ధ్యేయంగా కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంపై తిరిగి కాషాయ జెండా ఎగరేయడమే అంతిమంగా ఈ యాత్ర కొనసాగనుందని బీజేపీ వర్గాలు తెలిపాయి. కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని అన్ని మండలాలను, వీలైనన్ని ఎక్కువ గ్రామాల్లో “ప్రజాహిత పాదయాత్ర” చేసేలా రూట్ మ్యాప్ ను సిద్ధమైంది. తొలివిడతలో వేములవాడ, సిరిసిల్ల నియోజకవర్గాల్లో చేపట్టనున్నారు. సిరిసిల్ల జిల్లాలోని తంగళ్లల్లిలో తొలివిడత ముగింపు సభను నిర్వహించనున్నారు.
తొలిదశలో మొత్తం 119 కి.మీల మేరకు యాత్ర చేయనున్నారు. ఆయా నియోజకవర్గాల్లోని అన్ని మండలాల్లో యాత్ర చేయడంతోపాటు అధిక సంఖ్యలో గ్రామాల్లోకి వెళ్లి ప్రజలతో మమేకమవుతారు. వారి సమస్యలను అడిగి తెలుసుకుంటారు. ప్రధాని నరేంద్రమోదీ ప్రభుత్వం గ్రామాల, పట్టణాల అభివృద్ధికి కేటాయించిన
నిధులను, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరిస్తారు. ప్రజా సంగ్రామ యాత్ర చేపట్టి రాష్ట్రంలో పార్టీ విస్తరణకు కృషి చేశాను. రాష్ట్రమంతా పాదయాత్ర చేసి ప్రజల కష్టాలు కళ్లారా చూసిన బండి పేర్కొన్నారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం నాపై 100కు పైగా కేసులు పెట్టినా, దాడులు చేసినా మీరిచ్చిన ధైర్యంతో పోరాడిన.. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై పోరాటం చేస్తున్నారు. దేశహితం కోసం అబ్‌కీ బార్ 400 పార్.. తీస్రీ బార్ మోదీ సర్కార్ నినాదాలతో మూడోసారి బీజేపీ ప్రభుత్వ ఏర్పాటు కోసం జరుగుతున్న ఈ మహాయాగంలో మరోసారి సమిధగా మారడానికి మీ బిడ్డ సిద్ధమయ్యాడు’’ అని వివరించారు. కాగా, ప్రజాహిత పాదయాత్రలో భాగంగా మోదీ ప్రభుత్వం సాధించిన విజయాలపై విస్తృత ప్రచారం నిర్వహించనున్నట్లు బండి సంజయ్ తెలిపారు. బీఆర్‌ఎస్ పాలనలో జరిగిన అన్యాయాన్ని మరో సారి ప్రజలకు వివరిస్తానని, అధికార కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడతానని సంజయ్ తెలిపారు.