మావోయిస్ట్ అగ్రనేత కటకం సుదర్శన్ కన్నుమూత

Update: 2023-06-04 04:06 GMT



మావోయిస్టు పార్టీ అగ్రనేత, కేంద్ర కమిటీ పొలిట్ బ్యూరో సభ్యుడు ఆనంద్ అలియాస్ కటకం సుదర్శన్ కన్నుమూశారు. గత నెల 31న మధ్యాహ్నం గుండెపోటు రావటంతో ఆయన చనిపోయినట్టు ఆ పార్టీ కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ ఓ ప్రకటనలో తెలిపారు. కటకం సుదర్శన్ మరణంపై పార్టీ కేంద్ర కమిటీ సంతాపాన్ని ప్రకటించినట్టు వెల్లడించారు. ఈ నెల 5వ తేదీ నుంచి ఆగస్ట్ 3 వరకు కటకం సుదర్శన్ స్మృతిలో సంతాప సభలు నిర్వహించాలని ప్రజలకు పిలుపు ఇచ్చారు.

అంచలంచలుగా ఎదిగి..

సుదర్శన్‌ స్వస్థలం ఆదిలాబాద్‌ జిల్లా బెల్లంపల్లిలోని కన్నాలబస్తి. వరంగల్‌లో పాలిటెక్నిక్ విద్యను అభ్యసించిన ఆయన కమ్యూనిస్టు భావజాలానికి ఆకర్శితులయ్యారు. దీంతో 1980లో మావోయిస్టు ఉద్యమంలో చేరారు. అప్పటి నుంచి అజ్ఞాతంలో గడుపుతున్నారు. మావోయిస్టు పార్టీలో అంచలంచలుగా ఎదిగిన ఆయన సెంట్రల్‌ కమిటీ మెంబర్‌గా ఉన్నారు. ఆయనను ఆనంద్‌, మోహన్‌, వీరేందర్‌జీ అని వివిధ పేర్లతో పిలుస్తారు. 1975-1979 ప్రాంతంలో విప్లవోద్యమానికి ప్రభావితమై సుదర్శన్ ఛత్తీస్‌గఢ్ వెళ్లిపోయారు. 42 ఏళ్లుగా మావోయిస్టు పార్టీలో పనిచేస్తున్న ఆయన అంచెలంచెలుగా అగ్ర నేత స్థాయికి ఎదిగారు. కిషన్‌జీ ఎన్‌కౌంటర్ తర్వాత సెంట్రల్ రీజినల్ బ్యూరో ఆఫ్ సీపీఐకి చీఫ్‌గా కూడా పనిచేశారు. సుదర్శన్ ఎన్నోసార్లు పోలీసుల ఎదురు కాల్పుల నుంచి తప్పించుకున్నారు.


 



గెరిల్లా వార్ లో కటకం సుదర్శన్ దిట్ట..

సుదర్శన్‌పై హత్య కేసు సహా ఆంధ్రప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌లో మొత్తం 17 క్రిమినల్‌ కేసులు ఉన్నాయి. రెండేండ్ల క్రితం ఛత్తీస్‌గడ్‌లోని దంతేవాడలో సీఆర్‌పీఎఫ్‌ జవాన్లపై జరిగిన మావోయిస్టుల దాడిలో సుదర్శన్‌ హస్తం ఉన్నది. ఈ దాడిలో 70 మంది సీఆర్‌పీఎఫ్‌ జవాన్లు చనిపోయిన విషయం తెలిసిందే. ఇక గత నెల 28న ఛత్తీస్‌గఢ్‌ కాంగ్రెస్‌ నాయకులపై జరిగిన దాడికి పథక రచన చేసింది ఆయననేని పోలీసులు అనుమానిస్తున్నారు. ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో 2013లో కాంగ్రెస్ నేతలపై మావోల దాడిలో 27 మంది మరణించారు. ఈ భారీ దాడి వెనుక వ్యూహకర్త కటకం సుదర్శన్ అని టాక్. ఉత్తర తెలంగాణ నుంచి దండకారణ్యం వరకు మావోయిస్టు కార్యకలాపాల్లో సుదర్శన్ కీలకంగా పనిచేస్తూ వస్తున్నారు.

కుటుంబ సభ్యుల వివరాలివి

సుదర్శన్ తండ్రి మల్లయ్య 2017లో, తల్లి వెంకటమ్మ 2018లో మృతి చెందారు. ఆయన సతీమణి, మావోయిస్టు నాయకురాలు సాధన గత కొన్నేండ్ల క్రితం జరిగిన ఎన్‌కౌంటర్‌లో మృతిచెందింది. అప్పట్లో ఒకసారి మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చిన సుదర్శన్... మావోయిస్టు కేంద్ర కమిటీలో 8 మంది అరెస్టయ్యారని,22 మందిని ప్రభుత్వం చంపించిందని చెప్పారు. సహచరులు ఎంతమందిని కోల్పోయినా... ఆయన మాత్రం సాయుధ పోరును వీడలేదు.





Tags:    

Similar News