మేడారం జాతరకు వచ్చే భక్తులు ఈ ప్లేస్లకు కూడా తప్పక చూడాలి

By :  Bharath
Update: 2024-02-20 09:53 GMT

తెలంగాణ కుంభమేళా ప్రారంభమయింది. వివిధ రాష్ట్రాల నుంచి ఈ మహాజాతరకు భక్తులు తరలివస్తున్నారు. రెండేళ్లకోసారి జరిగే ఈ మేడారం గిరిజన జాతరకు సుమారు రెండు కోట్ల మంది తరలి రానున్నారని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే కొన్ని లక్షల మంది అమ్మవార్లను దర్శించుకున్నారు. వనదేవతలకు ముందస్తు మొక్కులు చెల్లించుకున్నారు. ఈ నేపథ్యంలో ములుగు జిల్లాలో జాతర జరుగనున్న 21, 22, 23, 24 తేదీల్లో నాలుగు రోజులు ప్రభుత్వం హాలిడేస్ ప్రకటించింది. కాగా జాతరకు వచ్చే భక్తులు మేడారంతో పాటు ఉమ్మడి వరంగల్ జిల్లాలోని మరికొన్ని ఆధ్యాత్మిక, టూరిస్ట్ ప్రాంతాలను సందర్శించొచ్చు. హైదరాబాద్ నుంచి వచ్చేవారు వరంగల్ కోట, భద్రకాళి ఆలయం, రామప్ప గుడిని చూడొచ్చు. ఏటూరునాగారం మీదుగా ఖమ్మం, ఏపీ నుంచి వచ్చే భక్తులు మంగపేటలోనిి మల్లూరు హేమాచల క్షేత్రాన్ని దర్శించుకోవచ్చు.

• వరంగల్ కోటను 13వ శతాబ్దంలో కాకతీయ వంశానికి చెందిన గణపతి దేవుడు ప్రారంభించగా.. ఆయన కూతురు రుద్రమదేవి పూర్తిచేసింది. ఈ కోట కాకతీయుల కళానైపుణ్యానికి ప్రతీక. ఇక్కడి ఖుష్ మహల్, రాతి కోట, చిల్డ్రన్స్ పార్క్ టూరిస్టులను ఆకర్షిస్తాయి.

• వరంగల్ రైల్వేస్టేషన్ నుంచి 5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది భద్రకాళి గుడి. హనుమకొండ బస్టాండ్ కు 4.4 కిలోమీటర్ల దూరం. గుడికి ఎదురుగా పెద్ద చెరువు ఉండగా.. దాన్ని భద్రకాళి బండ్ గా డెవలప్ చేశారు.

• వేయిస్తంభాల గుడి హనుమకొండ బస్టాండ్ కు 2 కిలోమీటర్ల దూరంలో, ములుగుకు వెళ్లే దారిలో ఉంటుంది. కాకతీయుల కళావైభవానికి ఈ గుడి ప్రతీకగా నిలుస్తుంది.

• హనుమకొండ నుంచి ములుగు వెళ్లే దారిలో గుడెప్పాడ్ క్రాస్ మీదుగా శ్రీకాళేశ్వర ముక్తీశ్వర స్వామి దేవాలయానికి చేరుకోవచ్చు. అక్కడ గోదావరి, ప్రాణహిత, అంతర్వాహిణిగా సరస్వతీ నది కలుస్తాయి. దీన్నే త్రివేణీ సంగమం అని పిలుస్తారు. ఈ గుడిలో ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఒకే పానపట్టంపై రెండు శివలింగాలు ఉంటాయి. దేశంలో ఉన్న మూడు సూర్య దేవాలయాల్లో ఒక్కటి ఇక్కడే ఉంది.

• యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయం ములుగు జిల్లాలోని వెంకటాపూర్ మండలం పాలంపేట గ్రామంలో ఉంది. హనుమకొండ నుంచి ములుగు రోడ్డు మీదుగా వెళ్తుండగా.. జంగాల పల్లి వస్తుంది. అక్కడి నుంచి 60 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తే.. రామప్పకు చేరుకోవచ్చు. ములుగు జిల్లా కేంద్రం నుంచి 15 కిలోమీటర్ల దూరమే ఉంటుంది.

• మంగపేట మండలం, మల్లూరులోని గుట్ట హేమాచల లక్ష్మీనృసింహస్వామి స్వయంభువుగా వెలిశాడు. ఈ ఆలయం రెండో యాదగిరి గుట్టగా ప్రసిద్ధి. అక్కడ నిత్యం ప్రవహించే చింతామణి అనే జలపాతం నీళ్లు తాగితే.. అన్ని రోగాలు పోతాయని చెప్తుంటారు.

• తెలంగాణ నయాగారాగా పేరుపొందిన బొగత జలపాతం ములుగు జిల్లాలోని వాజేడులో ఉంటుంది. జూన్, జులై, ఆగస్ట్ నెల్లో ఈ జలపాతం నిండుగా ప్రవహిస్తుంది. దీంతోపాటు కొంగాల జలపాతం కూడా టూరిస్టులు సందర్శించొచ్చు.




Tags:    

Similar News