Revanth Reddy: బీఆర్ఎస్ కోసం పనిచేస్తున్న అధికారుల వివరాలు సేకరిస్తున్నాం - రేవంత్ రెడ్డి
కాంగ్రెస్ పార్టీ పొత్తులో భాగంగా కమ్యూనిస్టు పార్టీలకు చెరో రెండు సీట్లు ఇచ్చిందన్న వార్తలపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్పందించారు. గాంధీ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పొత్తులపై చర్చలు ఇంకా కొనసాగుతున్నాయని స్పష్టం చేశారు. మరోవైపు కాంగ్రెస్ ఫస్ట్ లిస్టులో ఉన్న పేర్లు ఇవేనంటూ సోషల్ మీడియాలో వస్తున్న వార్తల్ని రేవంత్ ఖండించారు. అభ్యర్థుల ఎంపిక వార్తల విషయంలో మీడియా సంయమనం పాటించాలని కోరారు. కాంగ్రెస్‌పై తప్పుడు వార్తలు రాస్తే చర్యలు తీసుకుంటామని అన్నారు.
కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ ఇంకా కొనసాగుతోందని రేవంత్ స్పష్టం చేశారు. బరిలో నిలిపే వారి విషయంలో కాంగ్రెస్ ఓ విధానం పాటిస్తోందని, అన్ని అంశాలు బేరీజు వేసుకున్నాకే అభ్యర్థిత్వం ఖరారు చేస్తామని చెప్పారు. ప్రస్తుతం ఎమ్మెల్యే టికెట్లపై మాత్రమే నిర్ణయం తీసుకుంటున్నామని, కాంగ్రెస్ నేతలకు ఎంపీ, ఎమ్మెల్సీ, ఇతర పదవులు చాలా ఉన్నాయని అన్నారు. పార్టీ కోసం పనిచేసిన వారందరిని తప్పకుండా గుర్తించి గౌరవిస్తామని రేవంత్ తేల్చిచెప్పారు.
ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చాక పింఛన్లు తప్ప నిధులు విడుదల చేయకూడదని రేవంత్ అన్నారు. కొందరు ఎమ్మార్వోల నుంచి ఐఏఎస్‌ల వరకు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ కోసం కొందరు ఐఏఎస్ అధికారులు పనిచేస్తున్నారని, వారి వివరాల సేకరణకు కమిటీ నియమిస్తున్నట్లు రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.