ఎంఐఎం పార్టీ నేతలపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్, బీజేపీలను కాంగ్రెస్ విమర్శిస్తే అక్బరుద్దీన్, అసదుద్దీన్ ఎందుకు అసహనం వ్యక్తం చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. వాళ్లు ఎవరి పక్షాన ఉన్నారో, ఎవరికి మద్దతిస్తున్నారో తేల్చుకోవాలని సూచించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాకుండా బీజేపీ, బీఆర్ఎస్ కుట్ర చేస్తున్నాయని రేవంత్ ఆరోపించారు.
బీజేపీ పార్టీ ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీల్చే ప్రయత్నం చేస్తోందని రేవంత్ విమర్శించారు. 2018లోనూ ఆ పార్టీ ఇలాంటి కుట్రలే చేసి డిపాజిట్లు కోల్పోయిందని గుర్తుచేశారు. బీజేపీ, బీఆర్ఎస్ ఫెవికాల్ బంధం ప్రజలకు అర్థమైందని, ఈ రెండు పార్టీల కుట్రలను తిప్పికొట్టాల్సిన బాధ్యత ప్రతీ తెలంగాణ బిడ్డపై ఉందని అన్నారు. కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకొచ్చేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని రేవంత్ పిలుపునిచ్చారు.