కాంగ్రెస్ సునామీలో బీఆర్ఎస్ కొట్టుకపోవడం ఖాయం : రేవంత్

By :  Krishna
Update: 2023-11-08 13:38 GMT

తెలంగాణలో కాంగ్రెస్ సునామీ రాబోతుందని.. ఆ సునామీలో బీఆర్ఎస్ కొట్టుకపోవడం ఖాయమని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ప్రజల సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని చెప్పారు. రాజేంద్రనగర్లో నిర్వహించిన ప్రజా విజయభేరి సభలో రేవంత్ ప్రసంగించారు. ప్రాజెక్ట్‌ల పేరుతో కేసీఆర్ లక్ష కోట్ల దోపిడీకి పాల్పడ్డారని ఆరోపించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక కేసీఆర్ అవినీతి సొమ్మంతా కక్కిస్తామన్నారు.

కాంగ్రెస్ పై కేసీఆర్ అసత్య ప్రచారాలు చేస్తున్నారని రేవంత్ మండిపడ్డారు. రైతు బంధు, ఉచిత కరెంట్ కాంగ్రెస్ ఆపేయాలని కాంగ్రెస్ అంటుందని కేసీఆర్ చెబుతున్నారని.. కానీ ఉచిత కరెంట్ తెచ్చిందే కాంగ్రెస్ అని గుర్తు చేశారు. రైతు బంధు, ధరణిలో లోపాలు ఉన్నాయి కాబట్టే.. వాటిని సక్రమంగా అమలు చేయాలని డిమాండ్ చేశామన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రైతులకు 15వేల పెట్టుబడి సాయం, కౌలు రైతులకు 12వేలు అందిస్తామన్నారు. కేసీఆర్ ప్రభుత్వం 24గంటల కరెంట్ ఇస్తున్నట్లు నిరూపిస్తే తాను నామినేషన్ వేయనని.. ఒకవేళ ఇవ్వకపోతే కేసీఆర్ ముక్కు నేలకు రాయాలని రేవంత్ సవాల్ విసిరారు.

టికెట్ రాని వారికి పార్టీ అండగా ఉంటుందని రేవంత్ హామీ ఇచ్చారు. ఆశావాహులు చాలామంది ఉంటారని.. కానీ టికెట్ ఒక్కరికే వస్తుందన్నారు. బీఆర్ఎస్ ఓటమే లక్ష్యంగా కాంగ్రెస్ కార్యకర్తలంతా కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ ఎన్నికలు దొరల తెలంగాణ-ప్రజల తెలంగాణకు మధ్య జరుగుతున్నాయన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని చెప్పారు. గత ఎన్నికల్లో కేసీఆర్ ఇచ్చిన హామీలను ఎంతమేరకు అమలు చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు.

మేడిగడ్డ ప్రాజెక్టు మేడిపండులా పగిలిపోయిందని రేవంత్ విమర్శించారు. మేడిగడ్డను మోదీ ఎందుకు పరిశీలించడం లేదని ప్రశ్నించారు. మేడిగడ్డ పాపంలో మోదీ భాగస్వామ్యం ఎంత ఉందని నిలదీశారు. మోదీ మేడిగడ్డ గురించి మాట్లాడడు కానీ.. ఢిల్లీ లిక్కర్ స్కాంపై మాట్లాడతారని రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రడెం, శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్ట్‌లను కట్టింది కాంగ్రెస్ కాదా..హైదరాబాద్‌లో హైటెక్ సిటీ, ఔటర్ రింగ్ రోడ్, అంతర్జాతీయ విమానాశ్రయం తెచ్చింది కాంగ్రెస్ కాదా అని రేవంత్ అడిగారు.


Tags:    

Similar News