CONGRESS GOVERNMENT: డిసెంబర్ 9న 6 గ్యారెంటీలపై తొలి సంతకం : రేవంత్
తెలంగాణలో డిసెంబర్ 9న ఇందిరమ్మ రాజ్యం వస్తుందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. ఆ రోజున ఎల్బీ స్టేడియంలో కాంగ్రెస్ సీఎం 6 గ్యారెంటీలపై సంతకం పెట్టడం ఖాయమన్నారు. 4కోట్ల ప్రజలను కేసీఆర్ మోసం చేశారని.. వచ్చే ఎన్నికల్లో ప్రజలే ఆయనకు తగిన బుద్ధి చెప్తారన్నారు. సోనియా గాంధీ భిక్ష వల్లే కేసీఆర్ సీఎం, కేటీఆర్ మంత్రి అయ్యారని విమర్శించారు. రైతులకు ఉచిత కరెంట్, రుణమాఫీ, ఆరోగ్య శ్రీ, ఫీజు రీఎంబర్స్మెంట్ వంటివి కాంగ్రెస్ పథకాలు కావా అని ప్రశ్నించారు.
తమ కార్యకర్తలు, తమకు సహకరించే వారిపై కేసీఆర్ సర్కార్ కేసులు పెట్టి ఇబ్బందులకు గురిచేస్తే ఊరుకునేది లేదని రేవంత్ హెచ్చరించారు. కాంగ్రెస్ సహకరించే 75మంది లిస్ట్ ను కేటీఆర్ కేంద్రమంత్రికి ఇచ్చారని.. వారిపై బెదిరింపులకు దిగుతున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ నాయకుల ఫోన్లపై నిఘా పెట్టారన్నారు. కార్యకర్తలు 45 రోజులు అకుంఠిత దీక్షతో పని చేస్తే అధికారంలోకి వస్తుందన్నారు. అధికారులు కూడా కేసీఆర్ కు వత్తాసు పలికితే వడ్డీతో సహా తిరిగి చెల్లిస్తామని ఫైర్ అయ్యారు.