తుమ్మలతో రేవంత్ రెడ్డి భేటీ.. పార్టీలోకి ఆహ్వానించిన కాంగ్రెస్ నేతలు..!
ఖమ్మం జిల్లాకు చెందిన మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర రావుతో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. సుదర్శన్ రెడ్డి, మల్లు రవితో పాటు వెళ్లి ఆయనతో కాసేపు మాట్లాడారు. కాంగ్రెస్ లో చేరాలని వారు తుమ్మలను ఆహ్వానించారు. రేవంత్ విజ్ఞప్తిపై మాజీ మంత్రి సానుకూలంగా స్పందించినట్టు తెలుస్తోంది. బీఆర్ఎస్ నుంచి టికెట్ దక్కకపోవడంతో గత కొద్దిరోజులుగా బీఆర్ఎస్ కు దూరంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో తుమ్మల త్వరలోనే కాంగ్రెస్ లో చేరుతారన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. తాజాగా రేవంత్ రెడ్డి సహా కాంగ్రెస్ నేతలు ఆయనతో భేటీ కావడంతో తుమ్మల త్వరలోనే కాంగ్రెస్ కప్పుకోనున్నారన్న వార్తలకు మరింత బలం చేకూరింది.
ఖమ్మం జిల్లా సీనియర్ నాయకుల్లో ఒకరైన తుమ్మల నాగేశ్వర్ రావు 2018 ఎన్నికల్లో పాలేరు నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ తరఫున పోటీ చేశారు. అయితే కాంగ్రెస్ అభ్యర్థి కందాల ఉపేందర్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. అనంతరం కందాల బీఆర్ఎస్లో చేరారు. సిట్టింగ్ లకే ఈసారి టికెట్ ఇస్తానన్న కేఆర్ ఇచ్చిన మాట ప్రకారం పాలేరు టికెట్ ను కందాల ఉపేందర్ రెడ్డికి కేటాయించారు. దీంతో తీవ్ర అసంతృప్తికిలోనైన తుమ్మల అనుచరులతో సమావేశమై పార్టీ మార్పు అంశంపై చర్చించారు. వారి సూచన మేరకు ఆయన కాంగ్రెస్ లో చేరాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. పాలేరు టికెట్ ఇస్తామని కాంగ్రెస్ స్పష్టమైన హామీ ఇవ్వడంతో ఆయన ఆ పార్టీ కండువా కప్పుకునేందుకు సిద్ధమైనట్లు సమాచారం.