గతంలో కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్లో చేరిన 12మంది ఎమ్మెల్యేలను మళ్లీ అసెంబ్లీ గేటు కూడా తాకనీయొద్దని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీని, కార్యకర్తలను మోసం చేసిన వారికి తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. నకిరేకల్లో నిర్వహించిన కాంగ్రెస్ విజయభేరీ సభలో రేవంత్ ప్రసంగించారు. ఉమ్మడి నల్గొండ జిల్లా కాంగ్రెస్ అడ్డ అని ఇక్కడ బీఆర్ఎస్ గెలవకూడదన్నారు. సమైక్య రాష్ట్రంలో తెలంగాణ కోసం ఆమరణ నిరాహార దీక్ష చేసిన వ్యక్తి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అని చెప్పారు. ఉమ్మడి పాలన కంటే కేసీఆర్ పాలనలోనే తెలంగాణకు ఎక్కువ అన్యాయం జరిగిందన్నారు. గత ముఖ్యమంత్రులు 60ఏళ్లలో 69 వేల కోట్ల అప్పుచేస్తే.. కేసీఆర్ పదేళ్లలో 6 లక్షల కోట్ల అప్పు చేశారని ఆరోపించారు.
కాంగ్రెస్ కార్యకర్తల శ్రమతో గెలిచిన ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పార్టీ ఫిరాయించి.. దొరల గడిల దగ్గర కాపల కుక్కలా మారారని రేవంత్ విమర్శించారు. తెలంగాణ కోసం పదవిని పూచికపుల్లలా విసిరేసినా అని కేసీఆర్ చెబుతారని.. కానీ వారు రాజీనామాల పేరుతో ఎలక్షన్లు, కలెక్షన్లు అంటూ ఆస్తులు సంపాదించుకున్నారని ఆరోపించారు. కానీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాత్రం మంత్రి పదవిని వదులుకొని... తెలంగాణ వచ్చే వరకు దానిని తీసుకోనంటూ ఆ మాట మీద నిలబడ్డారన్నారు. కేసీఆర్ వంద రూపాయల నోటు లాంటి వాడని కేటీఆర్ చెబుతున్నాడని.. కేసీఆర్ వంద నోటు లాంటి వాడు కాదు దొంగ నోటు లాంటి వాడని ఎద్దేవా చేశారు.