పాలకులకు చిత్తశుద్ది లేకపోవడంతోనే పాలమూరు అభివృద్ధిలో ఇంకా వెనుకబడే ఉందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణ వచ్చాక కూడా పాలమూరు అభివృద్ధికి నోచుకోకపోవడం దురదృష్టకరమన్నారు. మంత్రి నిరంజన్ రెడ్డి నీళ్ల నిరంజన్ కాదు.. కమీషన్ల నిరంజన్ అని ఆరోపించారు. ఉద్యమ సమయంలో ఏమీ లేదని చెప్పిన నిరంజన్ కు వందల ఎకరాలు ఎక్కడివని ప్రశ్నించారు. వనపర్తి, నాగర్ కర్నూల్ నియోజకవర్గాల్లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బీఆర్ఎస్కు పదేళ్లు అవకాశమిచ్చారని.. కాంగ్రెస్కు ఒక్క అవకాశం ఇవ్వాలని కోరారు.
బీఆర్ఎస్కు మరోసారి అవకాశమిస్తే.. తెలంగాణ ఆగమైపోతుందని రేవంత్ అన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఇస్తే పార్టీ నష్టపోతదని తెలిసినా.. ఇక్కడి ప్రజల ఆకాంక్షల మేరకు తెలంగాణ ఇచ్చారన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని స్పష్టం చేశారు. వనపర్తికి కంపెనీలు రావాలంటే కాంగ్రెస్ గెలవాల్సిన అవసరముందన్నారు. పాలమూరు జిల్లాను రాష్ట్రానికే ఆదర్శంగా నిలిచేలా ఈ ఎన్నికల్లో ప్రజలు నిర్ణయం తీసుకోవాలని సూచించారు.
తెలంగాణలో కాంగ్రెస్ ఏం చేసిందని కేసీఆర్ అంటున్నారని.. సిద్ధిపేటలో కేసీఆర్ చదువుకున్న డిగ్రీ కాలేజీ కాంగ్రెస్ కట్టించిదేనన్నారు. కేసీఆర్ సొంతూరు చింతమడకలో గుడి, బడి, రోడ్డు వేసింది అనాటి కాంగ్రెస్ ప్రభుత్వం కాదా అని ప్రశ్నించారు. తెలంగాణ వచ్చాక కేసీఆర్ కుటుంబ తప్ప ప్రజలు బాగుపడలేదని అన్నారు. కేసీఆర్ అవినీతికి కాళేశ్వరం మాత్రం కుప్పకూలిందని విమర్శించారు. కేసీఆర్కు మూడోసారి అధికారం ఇస్తే ఆయన మనవడికి కూడా మంత్రి పదవి ఇస్తాడంటూ సెటైర్ వేశారు. ప్రజల సమస్యలను తీర్చే కాంగ్రెస్ ను గెలిపించాలని కోరారు.