ప్రజా యుద్ధ నౌక గద్దర్ మరణంపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గద్దర్ ఆకస్మిక మరణాన్ని తట్టుకోలేక పోతున్నానని అన్నారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రజాసమస్యలపై అలుపెరగని పోరాటం చేసిన గద్దర్ లేని లోటు పూడ్చలేనిదని రేవంత్ ఆవేదన వ్యక్తంచేశారు.
కాంగ్రెస్ పార్టీ ఇటీవలే ఖమ్మంలో నిర్వహించిన జనగర్జన సభలో గద్దర్ రాహుల్ గాంధీతో ఎంతో ఆప్యాయంగా మెలిగారని రేవంత్ గుర్తు చేసుకున్నారు. గాంధీ కుటుంబం పట్ల ఆయనకు అపారమైన అభిమానం ఉండేదని అన్నారు. రాష్ట్ర సాధన కోసం తన ఆట, పాటలతో జనాన్ని ఉత్తేజపరిచిన వ్యక్తి గద్దర్ అని చెప్పారు. గద్దర్ మృతికి సంతాపంగా అన్ని మండల కేంద్రాల్లోని కూడళ్ల వద్ద గద్దర్ చిత్ర పటాలు పెట్టి నివాళులు అర్పించాలని కాంగ్రెస్ శ్రేణులకు రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.