గువ్వల బాలరాజుపై దాడి ఘటనపై స్పందించిన రేవంత్

By :  Kiran
Update: 2023-11-12 14:25 GMT

అచ్చంపేట ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి గువ్వల బాలరాజుపై దాడిపై పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి స్పందించారు. అది దాడి కాదని డ్రామా అని విమర్శించారు. హైదరాబాద్‌లోని తన నివాసంలో మీడియాతో మాట్లాడిన రేవంత్.. ప్రశాంత్‌ కిషోర్‌ వ్యూహకర్తగా ఉన్న రాష్ట్రాల్లో ఇలాంటి కుట్రలు సాధారణమని అన్నారు. రాజకీయ లబ్ధి కోసం గతంలోనూ ఇలాంటి ఘటనలకు పాల్పడ్డారని ఆరోపించారు. ఏపీలో కోడికత్తి ఘటన, బెంగాల్‌లో మమతాబెనర్జీ కాలికి గాయం ఘటనలు ఇందుకు ఉదాహరణ అని చెప్పారు. కొత్త ప్రభాకర్‌ రెడ్డి, గువ్వల బాలరాజుపై దాడి ఘటనలు కుట్రలో భాగమేమన్న రేవంత్.. సంచలనం కోసమే కొత్త ప్రభాకర్‌రెడ్డిపై దాడి చేశారని పోలీసులు చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు.

కొత్త ప్రభాకర్పై దాడి చేసిన నిందితున్ని ఇప్పటి వరకు మీడియాకు ఎందుకు చూపలేదని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. దాడి ఘటనకు సంబంధించిన వివరాలను బయటపెట్టాలని డిమాండ్ చేశారు. నిందితుడు రాజు రిమాండ్ రిపోర్టుతో పాటు కాల్ రికార్డులు బయటపెట్టాలని అన్నారు. కుమారస్వామి ప్రెస్‌మీట్‌ను హరీశ్‌రావు ఎందుకు సమన్వయం చేశారని రేవంత్ ప్రశ్నించారు. కర్ణాటక నుంచి కిరాయికి మనుషులను రప్పించి తెలంగాణలో ప్రదర్శనలు చేయిస్తున్నారని, ఈసీకి ఫిర్యాదు చేసినా పట్టించుకోవట్లేదని వాపోయారు.

Tags:    

Similar News