బంగారు తెలంగాణ ఏమోగానీ.. బంగారం అమ్ముకునే స్థితికి తెచ్చారు : రేవంత్
తెలంగాణలో పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకుందా అని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. కొడంగల్ నియోజవకర్గంలోని బొంరాస్‌పేట్,దుద్యాలలో ఆయన రోడ్ షో నిర్వహించారు. కేసీఆర్ చెబుతున్న బంగారు తెలంగాణలో ఎంతమంది పేదలకు బంగారం పంచారని అడిగారు. బంగారు తెలంగాణ సంగతి దేవుడెరుగు.. ఉన్న బంగారాన్ని అమ్ముకునే పరిస్థితి వచ్చిందన్నారు. ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొనే తాము ఆరు గ్యారెంటీలను ఇచ్చామన్నారు.
కేసీఆర్ కొడంగల్ నియోజకవర్గాన్ని దత్తత తీసుకుంటానని చెప్పి.. అధికారంలోకి వచ్చాక ఒక్కసారైనా ఇక్కడికి వచ్చారా అని రేవంత్ నిలదీశారు. కొడంగల్లో కాంగ్రెస్ హయాంలో జరిగిన అభివృద్ధే కన్పిస్తోందని.. ఈ పదేళ్లలో బీఆర్ఎస్ నియోజకవర్గ అభివృద్ధికి బీఆన్ఎస్ చేసిందేమీ లేదని విమర్శించారు. లక్ష కోట్లు సంపాదించడమే బీఆర్ఎస్ నేతల లక్ష్యమన్నారు. ఇప్పుడు వచ్చి కేసీఆర్ మళ్ళీ ఓట్లు అడుగుతున్నారని.. వారికి ప్రజలే బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. మళ్లీ ఇందిరమ్మ రాజ్యం వస్తేనే ప్రజల కష్టాలు తీరుతాయన్నారు.