కేసీఆర్ను శిక్షించేందుకే ప్రజాకోర్టు : రేవంత్ రెడ్డి

Update: 2023-08-12 15:29 GMT

రాజకీయ ప్రయోజనాల కంటే ప్రజల ప్రయోజనాలకు కాంగ్రెస్ విలువ ఇచ్చిందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ బోయిన్ పల్లిలోని గాంధీ ఐడియాలజీ సెంటర్లో ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై కాంగ్రెస్ ప్రజాకోర్టు నిర్వహించింది. కంచె ఐలయ్య దీనికి న్యాయమూర్తిగా వ్యవహరించారు. ఈ కోర్టులో బీసీ, మైనార్టీ చార్జ్షీట్స్ సహా బీఆర్ఎస్ అవినీతి, తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై పార్టీ నేతలు చార్జ్షీట్లను దాఖలు చేశారు.




 


కేసీఆర్ను శిక్షించేందుకే ప్రజాకోర్టు నిర్వహించామని రేవంత్ చెప్పారు. తెలంగాణలో భూతద్దం పెట్టి వెతికినా సామాజిక న్యాయం కన్పించడం లేదని అన్నారు. తిరగబడదాం.. తరిమికొడదాం అనే ప్రతిగ్రామానికి తీసుకెళ్లాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. “ఉద్యమ సమయంలో నీళ్లు, నిధులు, నియామకాలు అని చెప్పిన కేసీఆర్ ఇచ్చిన హామీలు నెరవేర్చకపోగా ప్రజల హక్కులను కాలరాశాడని రేవంత్ ఫైర్ అయ్యారు. రాజులను, నియంతలను మరిపించేలా ప్రజలపై దాడులకు పాల్పడుతున్నారని విమర్శించారు.




 


తిరగబడదాం-తరిమికొడదాం కార్యక్రమం ఇలా..

కాంగ్రెస్ తిరగబడదాం - తరిమికొడదాం అనే పేరుతో నెల రోజుల పాటు బీఆర్ఎస్ వైఫల్యాలపై నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా 12వేల గ్రామాల్లో 3వేల డివిజన్ స్థాయిలలో ప్రత్యేక సమావేశాలను నిర్వహిస్తోంది. బీఆర్ఎస్ వైఫల్యాలపై ప్రజా కోర్టు నిర్వహించి.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై చార్జ్ షీట్ విడుదల చేస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా గడప గడపకు వెళ్లి 75 లక్షల కుటుంబాలను కాంగ్రెస్ శ్రేణులు కలవనున్నాయి. అంతేకాకుండా ప్రజా సమస్యలను, ప్రభుత్వ వైఫ్యలాలను ఎండగట్టేందుకు పోస్ట్ కార్డుల కార్యక్రమాన్ని సైతం కాంగ్రెస్ చేపట్టనుంది.


Tags:    

Similar News